‘కంటివెలుగు’ తర్వాత డాక్టర్లు అక్కర్లేదట!

‘కంటివెలుగు’ తర్వాత డాక్టర్లు అక్కర్లేదట!
  • ఆప్తోమెట్రిస్టులను పక్కనపెడ్తున్న సర్కారు
  • రాష్ట్రంలో 30శాతం మందికి  కంటిసమస్యలు
  • పీహెచ్​సీల్లో  కొనసాగిస్తే పబ్లిక్​కు  మేలు
  • సర్వీస్​ కొనసాగించాలంటున్న ఆప్తోమెట్రిస్టులు

పెద్దపల్లి, వెలుగు:  
స్క్రీన్​ టైం, వాతావరణ కాలుష్యం పెరగడం వల్ల  కంటి సమస్యలూ పెరుగుతున్నాయి.  రాష్ట్రంలో ప్రతీ పది మందిలో ముగ్గురు కంటి సమస్యలతో  బాధపడ్తున్నారని  కంటి వెలుగు కార్యక్రమం ద్వారా తేలింది.  ఇలాంటి పరిస్థితుల్లో  సర్కారు దవాఖాన్లలో  కంటి డాక్టర్ల  సంఖ్యను పెంచాల్సిన సర్కారు, తాత్కాలిక పద్ధతిలో  తీసుకుంటున్న ఆప్తోమెట్రిస్టులను కంటి వెలుగు క్యాంపులు కాగానే  పక్కనపెడ్తోంది.  ఇలా కాకుండా  ఆప్తోమెట్రిస్టుల సర్వీస్​ కొనసాగించడం వల్ల పీహెచ్​సీల  స్థాయిలో  కంటి వైద్య సేవలు మెరుగుపడ్తాయని తద్వారా అటు పబ్లిక్​కు, ఇటు డాక్టర్లకు మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రోగ్రాం తర్వాత పక్కనపెడ్తున్నరు.. 

కంటి వెలుగు ప్రోగ్రాం సేవల కోసం ఆప్తోమెట్రిస్టులను  వాడుకుంటున్న సర్కార్​ ఆ ప్రోగ్రాం పీరియడ్​ పూర్తి కాగానే  వారిని పట్టించుకుంటలేదు. రెండు టర్మ్​లు సేవలు అందించిన  తమను  నిరంతరం కొనసాగేలా,  పీహెచ్​సీల్లో చాన్స్​ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  ఫస్ట్​ టర్మ్​ కంటి వెలుగు  పూర్తి కాగానే  తమ సర్వీసు కంటిన్యూ చేయాలని ఆప్తోమెట్రిస్టులు  ఆందోళనలు కూడా చేశారు.  అయినా సర్కార్​ పట్టించుకోలేదు.  రాష్ట్రంలో 636 పీహెచ్​సీలు, 249 సీహెచ్​సీలు, 115 అర్బన్​ పీహెచ్​సీలు ఉన్నాయి. వాటిల్లో  ఏరియా హాస్పిటల్స్​లో  మాత్రమే ఆప్తాల్మజిస్టులు (కంటి వైద్య నిపుణులు) ఉంటున్నారు.  వీరు   సర్జరీలు మాత్రమే చేస్తారు.  కొన్ని ఏరియా హాస్పిటళ్లలో అసలే లేరు.  ప్రస్తుతం కంటి వెలుగు ప్రోగ్రాంలో  రాష్ట్ర వ్యాప్తంగా 1,491 మంది ఆప్తోమెట్రిస్టులు పనిచేస్తున్నారు.   వీరికి క్యాంపులు పెట్టినప్పుడు మాత్రమే డ్యూటీలు ఉంటున్నాయి. గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేస్తేగానీ ప్రజల కంటి సమస్యలు బయటపడ్తలేవు.  సమస్య ఉన్న వారిని లయన్స్​ క్లబ్​ లాంటి  సంస్థలు ముందుపడి వారికి ఆపరేషన్లు చేయిస్తున్నాయి.  

అదనపు బెనిఫిట్స్​ లేకున్నా.. 

కంటి వెలుగు ప్రోగ్రాం కోసం ఆప్తోమెట్రిస్టులను ఎలాంటి బెనిఫిట్స్​ ప్రకటించకుండా పనిలోకి తీసుకుంటున్నారు.  ఆప్తోమెట్రిస్ట్​ సర్టిఫికెట్​ ఉన్న  ప్రతీ ఒక్కరు  కంటివెలుగులో  తప్పకుండా పాల్గొనాలని సర్కార్​ ఆదేశిస్తోంది.  ఆప్తోమెట్రిస్టులతో పాటు,   ట్రైనీ ఆప్తోమెట్రిస్టులను కూడా  డ్యూటీలు చేయిస్తున్నారు. టెంపరరీగా నిర్వహించే  కంటివెలుగు కోసం సొంత క్లినిక్​లను  నడుపుకుంటున్న ఆప్తోమెట్రిస్టులు వాటిని మూసిఉంచాల్సి వస్తోంది.  దీంతో ప్రోగ్రాం పూర్తయిన తర్వాత తమ సెంటర్లు తిరిగి కొనసాగించలేక పోతున్నామని ఆప్తోమెట్రిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

అలాగే ఆప్తాల్మజిస్టుల వద్ద పనిచేసే ఆప్తోమెట్రిస్టులను కూడా  కంటివెలుగు కోసం బలవంతంగా తీసుకుంటున్నారు.  కంటి వెలుగు పూర్తయిన తర్వాత  మళ్లీ  డ్యూటీలో చేరుదామంటే  అక్కడ ఎవరో ఒకరితో  భర్తీ చేస్తున్నారు.  అలాగే  ట్రైనీ ఆప్తోమెట్రిస్టులను కూడా  నిర్బంధంగానే  పనిచేయిస్తున్నట్లు చెప్తున్నారు. తమ కోర్సుకు ఉపయోగంగా ఉంటుందని కంటివెలుగులో  పనిచేయడానికి ఒప్పుకుంటున్నామని,  తమను పీహెచ్​సీల్లో ఆప్తాల్మజిస్టులకు అసిస్టెంట్లుగా తీసుకోవాలని వారు కోరుతున్నారు.

రెగ్యులర్​ ​కంటి పరీక్షలు అవసరమే..

పెరుగుతున్న  కాలుష్యం, మారుతున్న ఆహార అలవాట్లు,  గంటల తరబడి సెల్​ఫోన్​చూడడం వంటి వాటితో  కంటి సమస్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. వయసుతో  సంబంధం లేకుండా కంటి జబ్బులు వస్తున్నాయి.  కానీ కంటి పరీక్ష కేంద్రాలు తక్కువగా ఉన్నాయి.  ఆప్తోమెట్రిక్​ కోర్సు కంప్లీట్​ అయిన వారు కంటి పరీక్ష కేంద్రాన్ని స్టార్ట్​ చేసుకొని ఉపాధి పొందుతున్నారు.  ప్రభుత్వ దవాఖాన్లలో మాత్రం ఆప్తోమెట్రిస్టు ఉద్యోగాలకు  ప్రభుత్వం ఇంపార్టెన్స్​ ఇవ్వడం లేదు.  దీంతో పేద జనాలు కంటి పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు.  దీంతో కంటి వ్యాధులు పెరిగిపోతున్నాయి.  కంటి వెలుగు ప్రోగ్రాం ద్వారా చేసిన టెస్టుల్లో  ప్రతీ జిల్లా నుంచి లక్షల మంది కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది.  పీహెచ్​సీల్లో ఆప్తోమెట్రిస్టులను  కొనసాగిస్తే  ప్రజల కంటి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించవచ్చు.  రెగ్యులర్​గా టెస్టులు, అద్దాల పంపిణీ, ఆపరేషన్లు అందుబాటులోకి వస్తాయి. 

మా ఉపాధి దెబ్బతింటోంది..

కంటివెలుగులో పనిచేయడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. సర్కార్​ ఆదేశాలతో విధులు నిర్వహిస్తున్నాం. కానీ గతంలో మేం చేస్తున్న చోట ఉపాధి కోల్పోతున్నాం.  కంటి వెలుగులో పనిచేసిన ఆప్తోమెట్రిస్టులను రెగ్యులర్​ చేసి ఏదో ఒక పీహెచ్​సీలో అపాయింట్​ చేయాలి.

- అఖిల, ఆప్తోమెట్రిస్టు, సుల్తానాబాద్​

పీహెచ్​సీల్లోకి తీసుకోండి..

రెండు టర్మ్​లు కంటి వెలుగులో పనిచేశాను.  ప్రోగ్రాం కాగానే పక్కన పెడ్తున్నారు. దీంతో  మా ఉపాధి కోల్పోతున్నాం.  నా సెంటర్​ వంద రోజులుగా మూసే ఉంది.  రెగ్యులర్​గా తీయకపోవడంతో పేషెంట్లు రావడం లేదు.  కంటి వెలుగులో చేస్తున్న ఆప్తోమెట్రిస్టులను పీహెచ్​సీలో కంటిన్యూ చేయాలి.

- దత్తగౌడ్​, ఆప్తోమెట్రిస్టు, పెద్దపల్లి