రూ.7,380 కోట్ల బిడ్డింగ్​ని పొందిన ఓఆర్​ఆర్​

రూ.7,380 కోట్ల బిడ్డింగ్​ని పొందిన ఓఆర్​ఆర్​
  • ఔటర్ రింగ్ రోడ్ లీజ్ ను ఫైనల్ చేసిన సర్కార్
  • రూ.7,380 కోట్లతో లీజ్ దక్కించుకున్న ఐఆర్​బీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలపర్స్ లిమిటెడ్‌
  • బిడ్​లో పోటీ పడిన 11 ప్రైవేటు సంస్థలు
  • హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​
  • ఎన్​హెచ్​ఏఐ నిబంధనల ప్రకారమే లీజ్ ఇచ్చామంటున్న హెచ్ఎండీఏ
  • చివరి నిమిషం వరకు టెండర్​ ప్రక్రియను గోప్యంగా ఉంచిన అధికారులు

హైదరాబాద్ ​: దేశంలో రహదారి రంగంలో జరిగిన అతిపెద్ద అసెట్​ మానిటైజేషన్​ ఒప్పందాలలో ఒకటిగా తెలంగాణ ప్రభుత్వం జరిపిన ఒప్పందం నిలవనుంది. ఏప్రిల్​ 27న ఐఆర్​బీ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలపర్స్​ లిమిటెడ్ ​టోల్​, ఆపరేట్​, ట్రాన్స్​ఫర్​(టీవోటీ) ప్రాతిపాదికన నెహ్రూ ఔటర్​ రింగ్​రోడ్డు (ఓఆర్​ఆర్​)ను దక్కించుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం హెచ్​ఎండీఏ నవంబర్​ 9, 2022న అంతర్జాతీయంగా టెండర్లు పిలిచింది. అనంతరం ఔటర్​ రింగ్​రోడ్డు లీజ్​ టెండర్లను ఖరారు చేసింది. టెండర్లలో మొత్తం 11 సంస్థలు పాల్గొన్నాయి. ఎన్ హెచ్​ ఏ ఐ నిబంధనల ప్రకారమే టెండర్లు పిలిచామంటున్న అధికారులు, ఆ ప్రక్రియ వివరాలను చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచడం గమనార్హం.

ఐఆర్​బీ కంపెనీ రూ.7,380 కోట్లకు దీనిని దక్కించుకుంది. ఇప్పుడు 30 ఏళ్ల పాటు ఔటర్​ రింగ్​రోడ్డు నిర్వహణ, టోలు వసూలు సదరు సంస్థే బాధ్యతలు చేపట్టనుంది. మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్​, అర్బన్​ డెవలప్​మెంట్​ స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ అరవింద్​కుమార్​ మాట్లాడుతూ..  ఈ ఒప్పందం రాష్ట్రానికి గణనీయమైన ఆదాయం తెచ్చిపెడుతుందని, ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. దేశంలోని రోడ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ప్రాజెక్ట్​ల కోసం ఖరారు చేసిన ఉత్తమ బిడ్​లలో ఇది ఒకటి అని చెప్పారు. 

సీఎం కేసీఆర్​ హర్షం..

ఐఆర్​బీతో జరిగిన ఒప్పందంపై సీఎం కేసీఆర్​ హర్షం వ్యక్తం చేశారు. "ఈ లావాదేవితో పెట్టుబడి అవకాశాలకు మరింత ప్రోత్సాహం వస్తుంది. మౌలిక సదుపాయాలు, రాష్ర్ట అభివృద్ధి ప్రాజెక్టులకు ఇది తలుపులు తెరుస్తుంది. కొత్తగా ఉద్యోగావకాశాలు పెరిగి, ఈ ప్రాంత సమగ్రాభివృద్ధి జరుగుతుంది. ఈ బిడ్​ హైదరాబాద్​ పై పెట్టుబడిదారులకు ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది. ప్రభుత్వ సరళతర విధానాలే పెట్టబడిదారులను ఆకర్షిస్తున్నాయి" అని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు.

సరళతర విధానాలతోనే సాధ్యం..

ఇదే విషయంపై ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. "ప్రభుత్వం అనుసరించిన సులభతర విధానాలే పెట్టుబడుల ఆకర్షణకు కారణమవుతున్నాయి. తెలంగాణలో పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం ఉంది. వ్యాపారాలను స్థాపించాలన్నా, విస్తరించాలన్న తెలంగాణే అనుకూలమని మరోసారి స్పష్టమైంది." అని కామెంట్స్ చేశారు.