నాగ్​పూర్‍ బాటలో ఓరుగల్లు మిర్చి రైతు

నాగ్​పూర్‍ బాటలో  ఓరుగల్లు మిర్చి రైతు
  •  వరంగల్‍ ఏనుమాముల మార్కెట్​లో రేటు తగ్గించిన వ్యాపారులు
  • దాచుకుందామంటే కోల్డ్ స్టోరేజీలు దొరకనిస్తలే
  • మంచి రేటు రావడంతో నాగ్​పూర్​కు తరలింపు  

వరంగల్/నల్లబెల్లి, వెలుగు: ఓరుగల్లు మిర్చి రైతులు తమ పంట అమ్ముకునేందుకు పక్క రాష్ట్రంలోని నాగపూర్‍ బాట పడ్తున్నారు. రాష్ట్రంలో మిర్చి కొనుగోళ్లకు ప్రధాన కేంద్రంగా ఉండే వరంగల్‍ ఏనుమాముల మార్కెట్​లో వ్యాపారులు, ఆడ్తిదారులు ఒక్కటై రైతులు నిలువుదోపిడీ చేస్తున్నారు. మిర్చి పంటకు అంతర్జాతీయంగా డిమాండ్‍ లేదని చెప్తూ గడిచిన రెండు నెలలుగా మిర్చికి రేటుపెడ్తలేరు. కనీసం పంటను కొన్ని నెలలపాటు దాచుకుందామని వెళ్తున్న రైతులకు కోల్డ్ స్టోరేజీలు కూడా దొరకనిస్తలేరు. దీంతో ఎటూపాలుపోని రైతులకు  ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్లు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. 

జెండా పాట రూ.27 వేలు.. రైతుకు కట్టిచ్చేది 14 వేలు

గడిచిన రెండు నెలలుగా వరంగల్‍ ఏనుమాముల మార్కెట్​లో జెండా పాటకు.. రైతులకు కట్టించే ధరకు ఏకంగా రూ.10 వేల తేడా ఉంటోంది.  ఉదాహరణకు.. చపాట రకాని(దొడ్డు మిర్చి)కి ఏనుమాముల మార్కెట్లో సగటున రూ.27 నుంచి 28 వేల జెండా పాట పెడుతున్నారు. తీరా అడ్తిదారులు రైతుల నుంచి కొనుగోలు చేసే సమయంలో క్వాలిటీలేదనే సాకుతో క్వింటాల్‍ చపాట మిర్చికి కేవలం రూ.14 వేల నుంచి 15 వేలు మాత్రమే కట్టిస్తున్నారు. తేజ రకం రూ.19 వేల నుంచి రూ.20 వేలు ఉంటే రూ.12 నుంచి13 వేలు చెల్లిస్తున్నారు. ఏదో వంకతో ప్రతి బస్తాలో 2 కిలోల బరువు తక్కువ లెక్కిస్తున్నారు.

ఛలో.. నాగపూర్‍ మార్కెట్‍

ఏనుమాముల మార్కెట్​లో వ్యాపారుల చేతిలో మోసపోతున్న రైతులు.. కొద్దిరోజులుగా పంట అమ్ముకునేందుకు  పక్క రాష్ట్రంలోని నాగ్​పూర్‍ మార్కెట్‍కు వెళ్తున్నారు. సోమ, మంగళవారాల్లో  నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల పరిధిలోని కొండాయిపల్లి, ఆశ్రవెల్లి, నారక్కపేట, రంగాపూర్‍, నందిగామ, రేలకుంట, రుద్రగూడెం, నర్సింగాపురం, బాంజీపేట, కమ్మపెల్లి, చంద్రయ్యపల్లి తదితర గ్రామాల నుంచి రైతులు లారీల్లో మిర్చి పంటతో నాగపూర్‍ తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చపాట రకానికి వరంగల్ లో క్వింటాల్​కు రూ.14 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని, కానీ నాగపూర్‍ మార్కెట్​లో మాత్రం  సగటున రూ.26 వేలు  పలుకుతోందన్నారు. ట్రాన్స్ పోర్ట్​ఖర్చు పోగా,  బాగానే గిట్టుబాటు అవుతుండడంతో నాగ్​పూర్​ తీసుకెళ్లడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. 

అక్కడ తరుగు తీస్తలే.. 

వరంగల్‍ మార్కెట్​లో రకరకాల కారణాలు చెప్పి.. అడ్తిదారులు 2 కిలోలు తరుగుతీస్తన్రు.  నాగ్​పూర్‍ మార్కెట్​లో ఎలాంటి కటింగ్​ లేకుండా జోకుతున్నరు.  రేటు మంచిగా ఉండి మోసం లేదనే నాగ్​పూర్​తీస్కపోతన్నం. 
పెద్ది జైపాల్‍రెడ్డి (బాంజీపేట) 

అక్కడికి ఇక్కడికి సానా తేడా

ఈ ఏడాది ఏనుమాముల మార్కెట్‍కు.. నాగ్​పూర్‍ మార్కెట్‍కు మిర్చి రేట్లల్ల శానా తేడా ఉంది. చపాట రకానికి  నాగపూర్‍లో రూ.26 నుంచి రూ.27వేలు పడ్తే , ఇక్కడ రూ.14వేలే వస్తంది. ట్రాన్స్​పోర్ట్​కు ఒక్కో బస్తా మీద రూ.200 అదనపు ఖర్చు అయినా నాగ్​పూర్​ మార్కెట్లనే మాకు గిట్టుబాటు అయింది.    
 పోగుల  పైడి (నారక్కపేట)