బీజేపీ పదేండ్ల పాలనలో అసమానతలు పెరిగినయ్ : రాహుల్ గాంధీ

బీజేపీ పదేండ్ల పాలనలో అసమానతలు పెరిగినయ్  : రాహుల్ గాంధీ
  • మేం గెలిస్తే కులగణన, ఆర్థిక సర్వే చేస్తాం
  •     ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అగ్రవర్ణ పేదలను లెక్కిస్తాం
  •     దేశంలో 1% మంది చేతిలోనే 40% సంపద

పాటణ్ (గుజరాత్):   బీజేపీ పదేండ్ల పాలనలో దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలు పెరిగిపోయాయని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని 70% మంది జనాభా వద్ద ఉన్నంత సంపద కేవలం 22 మంది చేతుల్లోనే ఉందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తమను గెలిపిస్తే కులగణన, సామాజిక, ఆర్థిక సర్వే చేపడతామని మరోసారి ఆయన స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అగ్రవర్ణ పేదలను లెక్కించి, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను బట్టి సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. సోమవారం గుజరాత్​లోని పాటణ్ టౌన్​లో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి చందన్ జీ ఠాకూర్ తరఫున రాహుల్ ప్రచారం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేసుకున్నాయని చెప్పారు. ‘‘దేశ జనాభాలో 90% మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే ఉన్నారు. కానీ కార్పొరేట్, మీడియా, ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ యూనివర్సిటీలు, బ్యూరోక్రాట్లలో వారు ఎక్కడా కనిపించరు. బడుగు బలహీనవర్గాల వారు ఎక్కువగా రైతులుగా, కార్మికులుగా, చిరువ్యాపారులుగా, నిరుద్యోగులుగానే ఉన్నారు. కేంద్రంలో 90 మంది ఐఏఎస్ ఆఫీసర్లలో ముగ్గురే బీసీలు ఉన్నారు. వారికి అప్రాధాన్య పోస్టులే కేటాయించారు. అందుకే మేం అధికారంలోకి రాగానే ముందుగా కులగణన, ఆర్థిక సర్వే చేస్తాం. ఏయే రంగంలో ఏయే వర్గాలకు ఎంత ప్రాతినిధ్యం ఉందో గుర్తిస్తాం. ఆ తర్వాత దామాషా పద్ధతిన వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటాం” అని రాహుల్ వివరించారు.

సంపద పంపిణీ జరగాలి.. 

రిజర్వేషన్లకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమని రాహుల్ అన్నారు. దేశ సంపదను, అధికారాన్ని, సహజ వనరులను కేవలం 22 నుంచి 25 మంది వ్యక్తులే కంట్రోల్ చేయాలని ఆయన భావిస్తున్నారని ఆరోపించారు. గత పదేండ్లలో ఇదే జరిగిందన్నారు. రైతులకు రుణమాఫీని తిరస్కరించిన మోదీ ప్రభుత్వం 22–25 మంది వ్యక్తులకు మాత్రం రూ. 16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందన్నారు. దేశంలో సంపదంతా కొద్ది మంది చేతిలోనే ఉందన్నారు. అందుకే ఏ వర్గానికీ అన్యాయం జరగకుండా సంపద పంపిణీ జరగాలన్నదే కాంగ్రెస్ విధానమన్నారు. తాము అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. మహిళలకు ఏడాదికి రూ. లక్ష సాయం, రైతులకు రుణమాఫీ, ఎంఎస్పీకి చట్టబద్ధత వంటి హామీలను అమలు చేస్తామన్నారు.