మళ్లీ కాంగ్రెస్​లో గుత్తా శకం 

మళ్లీ కాంగ్రెస్​లో గుత్తా శకం 
  •     మండలి చైర్మన్​గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్​రెడ్డి కాంగ్రెస్​లో చేరిక
  •     గుత్తా తమ్ముడు మదర్​ డెయిరీ చైర్మన్​ జితేందర్​రెడ్డితో సహా పలువురు ముఖ్యులు 
  •     2016 తర్వాత మళ్లీ కాంగ్రెస్​లో అమిత్​ఎంట్రీ 
  •     ఇప్పటికే కాంగ్రెస్​లో చేరిన గుత్తా వర్గం 

నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లా కాంగ్రెస్​లో గుత్తా శకం మళ్లీ మొదలైంది. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం అప్పుడు నల్గొండ కాంగ్రెస్​ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన గుత్తా సుఖేందర్​రెడ్డి బీఆర్ఎస్​లో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలినాళ్లలో రాజకీయ పునరేకీకరణలో భాగంగా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్​లో చేరారు. టీడీపీలో తొలిసారి ఎంపీగా గెలుపొందిన ఆయన దివంగత సీఎం రాజశేఖర్​రెడ్డి ఆహ్వానం మేరకు 2009లో కాంగ్రెస్​లో చేరారు. దాదాపు ఏడేళ్లపాటు కాంగ్రెస్​లో కీలక పాత్ర పోషించిన గుత్తా 2016 లో బీఆర్ఎస్​లో చేరారు.

ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నందున సుఖేందర్ రెడ్డికి బదులు ఆయన కొడుకు అమిత్​రెడ్డి, భార్య అఖిలారెడ్డి, గుత్తా తమ్ముడు మదర్​డెయిరీ మాజీ చైర్మన్ గుత్తా​జితేందర్​రెడ్డి కాంగ్రెస్​లో చేరారు. సోమవారం హైదరాబాద్​లో స్టేట్​కాంగ్రెస్ ఇన్​చార్జి దీపాదాస్​ మున్షీ, జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర ముఖ్యనాయకులు అమిత్​ను పార్టీలోకి ఆహ్వానించేందుకు గుత్తా నివాసానికి వెళ్లారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గుత్తా అమిత్, జితేందర్​రెడ్డి, కొడుకు అశ్విన్ రెడ్డి కాంగ్రెస్​లో చేరారు. అమిత్​రాకతో జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. 

అయోమయంలో బీఆర్ఎస్.. 

గుత్తా ఫ్యామిలీ కాంగ్రెస్​లో చేరడంతో బీఆర్ఎస్​లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు పోలింగ్​సమయం దగ్గరపడుతున్న నేపధ్యంలో గుత్తా షాక్​మరింత కలవరపాటుకు గురిచేసింది. జిల్లాలో ఇ ప్పటికే బీఆర్ఎస్ కేడర్​చెల్లాచెదురైంది. గుత్తాతో అనవసరంగా పంచాయతీ పెట్టుకున్నామనే అభిప్రాయాన్ని పలువురు మాజీ ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు. గుత్తాతో విభేదాలు వద్దని వారించినప్పటికీ ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు.. సుఖేందర్​రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేశారు. గుత్తాపై హైకమాండ్ కు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. చివరకు అమిత్​ఎంపీ టికెట్​విషయంలో కూడా జిల్లా నాయకులు అభ్యంతరం చెప్పడమేగాక, సుఖేందర్ రెడ్డిని అవమానించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అమిత్​చివరకు పార్టీ మారారు.  

గుత్తా చేరికతో కాంగ్రెస్​కు మరింత బలం.. 

గుత్తా ఫ్యామిలీ రాకతో కాంగ్రెస్ మరింత బలపడుతుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ముఖ్యంగా నల్గొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, నకిరేకల్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో గుత్తా వర్గం బలంగా ప నిచేస్తోంది. ఈ నియోజకవర్గాలకు చెందిన మున్సిపల్​చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులందరూ ఇప్పటికే బీఆర్ఎస్​కు గుడ్​బై చెప్పారు. ఇప్పుడు అమిత్​చేరిక సందర్భంగా మరిన్ని చేరికలు ఉంటాయని నాయకులు భావించారు. ఇందులో భాగంగానే ఆయా నియోజకవర్గాల్లో సుమారు 50 మంది ముఖ్యమైన లీడర్ల జాబితా సిద్ధం ​చేశారు. కానీ, ప్రస్తుతం ఎమ్మెల్యేలందరూ ఎన్నికల బిజీలో ఉన్నందున చేరికల కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు.