
హైదరాబాద్, వెలుగు: మూడేళ్ల పదవీ కాలం పూర్తి చేసినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ ప్రకారం ఎక్సైజ్ ఆఫీసర్లను బదిలీ చేయలేదంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఎన్నికల విధులతో సంబంధం లేని వాళ్లను బదిలీ చేయాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది. ఈ విషయంలో ఎక్సైజ్ అధికారుల బదిలీలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. ఎక్సైజ్ అధికారులను బదిలీ చేయకపోవడాన్ని సికింద్రాబాద్‌లోని తిరుమలగిరికి చెందిన గవర్నమెంట్ రిటైర్డు ఎంప్లాయ్ బొందిలి నాగాధర్ సింగ్ పిల్ దాఖలు చేశారు. దీనిని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ల బెంచ్ కొట్టివేస్తూ సోమవారం తీర్పు చెప్పింది.