T20 World Cup: బ్యాటింగ్ సమస్యలతో సూపర్–8కి భారత్.. సౌతాఫ్రికా ముందు నిలిచేనా..?

T20 World Cup: బ్యాటింగ్ సమస్యలతో సూపర్–8కి భారత్.. సౌతాఫ్రికా ముందు నిలిచేనా..?

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి మంచి ఫామ్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. కానీ లోతుగా పరిశీలిస్తే.. సూపర్–8కి ముందు పరిష్కరించుకోవాల్సిన కొన్ని కీలక సమస్యలు  బయటకు వస్తున్నాయి. ఈ టోర్నమెంట్లో “ప్లేయర్ టు వాచ్”గా బరిలోకి దిగిన అభిషేక్ కు పరిస్థితులు పెద్దగా కలిసి రావడం లేదు. వరుసగా మూడు మ్యాచ్ లలో డకౌట్లతో అవుట్ అయ్యాడు. ప్రత్యర్థి జట్లు అతడిలోని టెక్నికల్ లోపాలను గమనించి స్పిన్‌తో ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా పవర్‌ప్లేలో స్పిన్నర్లకు అభిషేక్ దొరికిపోతున్నాడు. పాకిస్థాన్, నెదర్లాండ్స్ టీమ్స్ ఈ బలహీనతను బాగా ఉపయోగించుకున్నాయి. దక్షిణాఫ్రికాతో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు అభిషేక్ తన టెక్నిక్‌తో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది.

అభిషేక్ శర్మ కంటే ఎక్కువగా తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ల ప్రదర్శన ఇప్పుడు చర్చకు వస్తుంది. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 84 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్, ఆ తర్వాత మ్యాచ్‌ల్లో అదే జోరును కొనసాగించలేకపోయాడు. గత 3 మ్యాచ్‌ల్లో 70 బంతుల్లో కేవలం 78 పరుగులే చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, తిలక్ వర్మ స్ట్రైక్‌రేట్ ఈ సీజన్‌లో 120.45గా ఉంది. వీరిద్దరూ ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్లకు ఇబ్బంది పడుతూ మిడిల్ ఓవర్లలో భారత్ రన్‌రేట్ తగ్గడానికి ప్రధాన కారణం అవుతున్నారు.

జట్టుపై వచ్చే విమర్శలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే అంటున్నాడు. ఇది వరల్డ్ కప్, ఇక్కడ ఆట సులభంగా ఉండదు.. పరిస్థితికి తగ్గట్టే తిలక్, సూర్యకుమార్ బ్యాటింగ్ చేస్తారు.. జట్టు అవసరాన్ని బట్టి వాళ్ల ఆట మారుతుంది అని భరసా ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్ జట్టును ఎక్కడికైనా తీసుకెళ్లగలడు అని దూబే వ్యాఖ్యానించాడు. 4 విజయాలు భారత్‌కు ధైర్యం ఇస్తున్నప్పటికీ, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లో స్థిరత్వం లేకపోవడంతో పాటు స్పిన్‌ను ఆడటంలో బ్యాటర్లు మెరుగుపడితేనే సూపర్–8లో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో భారత్ పూర్తి స్థాయిలో ఆధిపత్యం చూపించే అవకాశం ఉంది.