నాటు నాటు పాటకు.. రెండేళ్లు పట్టింది : చంద్రబోస్

నాటు నాటు పాటకు.. రెండేళ్లు పట్టింది : చంద్రబోస్

అస్కార్ అవార్డ్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరి నోట మార్మోగుతుంది. ఇప్పటికే యూట్యూబ్, టిక్ టాక్ లో రికార్డులు క్రియేట్ చేయటమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ పాట ఎంతో ఫేమస్ అయ్యింది. ఈ క్రమంలోనే ఈ సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ రావటం తెలుగు సినీ ఇండస్ట్రీకి మరో మైలురాయి..

ఆర్ఆర్ఆర్ మూవీలో పాట రాయటానికి దర్శకుడు రాజమౌళి దగ్గరకు వెళ్లినప్పుడు ఒకే ఒక విషయం చెప్పారు.. అచ్చ తెలుగులో ఉండాలి.. ఎక్కడా ఇంగ్లీష్ పదాలు వాడొద్దు.. అంతే కాకుండా ఎవర్నీ కించపరిచే విధంగా పదాలు ఉండకూడదు.. తిట్టినట్లు ఉండకూడదు.. కేవలం మన పౌరుషం.. మనలోని నిజాయితీ.. మన మట్టి మనిషి జీవితాన్ని పాట ద్వారా ఆవిష్కరించగలిగితే చాలు అని స్పష్టం చేశారంట రాజమౌళి.. 

ఈ విధంగా పాట రాయటానికి చాలా కాలం పట్టిందన్నారు చంద్రబోస్. 90 శాతం పాట నెల రోజుల్లోనే అయిపోయిందని.. మిగతా 10 శాతం పాట కంప్లీట్ కావటానికి 19 నెలలు పట్టిందన్నారు చంద్రబోస్.. దీని కోసం 35 రకాలుగా పాడారని.. పలు రకాలుగా.. పలు విధాలుగా కొన్ని నెలల పాటు ప్రయోగం చేయటం జరిగిందన్నారు. ప్రతి పదం.. ప్రతి అక్షరం పూర్తి పాట రూపంలోకి తీసుకురావటానికి 19 నెలలు పట్టిందని.. ఆ కష్టానికి ఇప్పుడు ఆస్కార్ అవార్డ్ తో గుర్తింపు లభించిందన్నారు చంద్రబోస్.  బాహుబలిలో పాటలు రాసే అవకాశం రాలేదు.. ఆర్ఆర్ఆర్ లో వచ్చిన అవకాశంతో.. ఏకంగా ఆస్కార్ అవార్డ్ రావటం జీవితానికి సార్థకత వచ్చిందన్నారు చంద్రబోస్.

ఏకాగ్రత.. చిత్తశుద్ధి, నిజాయతీతో రాసిన పాటకు.. ప్రపంచ గుర్తింపు రావటం అనేది ఎంతో సంతోషాన్ని ఇస్తుందని.. అందులోనూ పూర్తిగా తెలుగులోనే.. తెలుగు సాహిత్యంతో ముడిపెట్టి.. ఒక్క ఆంగ్ల అక్షరం లేకుండా రాసిన పాటకు.. అంతర్జాతీయ అవార్డ్ ఆస్కార్ రావటం అనేది జీవితంలో మర్చిపోలేని ఘటన అన్నారు చంద్రబోస్