ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటి 'ఆస్కార్' ( Oscars ) భావిస్తాం. అయితే ఈ సారి అవార్డుల ఎంపికలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లేటెస్ట్ గా విప్లవాత్మక మార్పులు చేపట్టింది. 2027 మార్చిలో జరగనున్న 99వ ఆస్కార్ వేడుకల నుంచి ఈ కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఈ కొత్త మార్పులు ముఖ్యంగా భారతీయ సినిమాలకు, నటీనటులకు ఊరటనిచ్చేలా ఉన్నాయి..
భారతీయ సినిమాలకు బూస్ట్..
ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం..'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' విభాగంలో ప్రతి దేశం కేవలం ఒక్క సినిమాను మాత్రమే అధికారికంగా పంపే అవకాశం ఉండేది. దీనివల్ల మన దేశంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు అంతర్గత ఎంపిక ప్రక్రియలో వెనుకబడిపోయేవి. 2024లో పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ ప్రతిష్టాత్మక కాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'గ్రాండ్ ప్రిక్స్' గెలిచినప్పటికీ, భారత్ నుండి అధికారిక ఎంట్రీగా ‘లాపతా లేడీస్’ వెళ్ళింది. దీనిపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది.
అయితే, కొత్త రూల్స్ ప్రకారం.. ఇకపై ఆస్కార్ కమిటీ ఎంపికతో సంబంధం లేకుండా, ప్రపంచంలోని టాప్-6 అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో (కాన్, బెర్లిన్, వెనిస్, సన్‌డాన్స్, టొరంటో, బూసాన్) ప్రధాన అవార్డులు గెలుచుకున్న సినిమాలు నేరుగా ఆస్కార్ బరిలోకి దిగవచ్చు. దీనివల్ల ఒకే ఏడాది భారత్ నుంచి ఒకటి కంటే ఎక్కువ సినిమాలు 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం' కేటగిరీలో పోటీ పడే అవకాశం దక్కింది. ఇది ప్రతిభావంతులైన స్వతంత్ర చిత్ర నిర్మాతలు తమ సత్తా చాటడానికి అద్భుతమైన అవకాశం దక్కుతుంది..
నటీనటులకు ‘డబుల్’ నామినేషన్స్
నటన విభాగంలోనూ అకాడమీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒకే నటుడు లేదా నటి ఒకే కేటగిరీలో రెండు వేర్వేరు సినిమాలకు నామినేషన్లు పొందే అవకాశం ఉంది. గతంలో ఎన్ని అద్భుతమైన పాత్రలు చేసినా, ఒక కేటగిరీలో ఒక నామినేషన్‌కే పరిమితం చేసేవారు. ఇప్పుడు ఓటింగ్ టాప్-5లో ఉంటే, ఒకే నటుడికి రెండు నామినేషన్లు రావచ్చు.
►ALSO READ | అజిత్ 'గ్లాడియేటర్స్' టీజర్ రిలీజ్.. థియేటర్లలోకి డాక్యుమెంటరీ ఎప్పుడంటే?
AI పై కఠిన ఆంక్షలు
సాంకేతికత ఎంత పెరిగినా, మానవ మేధస్సు , సృజనాత్మకతకే ప్రాధాన్యం ఇవ్వాలని అకాడమీ నిర్ణయించింది. కథ, స్క్రీన్ ప్లే, నటన విభాగాల్లో కేవలం మనుషులు చేసిన పనికి మాత్రమే అవార్డులు దక్కుతాయి. AI సృష్టించిన పాత్రలకు లేదా చాట్‌బాట్స్ రాసిన కథలకు అవార్డులు ఇవ్వరు. జనరేటివ్ ఏఐ (AI) వాడితే మేకర్స్ పూర్తి పారదర్శకతతో ఉండాలని, అవసరమైతే రిపోర్ట్స్ సమర్పించాలని స్పష్టం చేసింది. సాంకేతికత పెరుగుతున్న తరుణంలో, ఆస్కార్ తన ఉనికిని కాపాడుకునేందుకు కఠిన నిర్ణయం తీసుకుంది.
దర్శకుడికే గుర్తింపు
ఇంటర్నేషనల్ ఫిలిం కేటగిరీలో గెలిచే ఇకపై అవార్డును దేశానికి కాకుండా, నేరుగా దర్శకుడికే ప్రధానం చేస్తారు. ఆస్కార్ విగ్రహంపై ఇకపై దేశం పేరుతో పాటు, నేరుగా దర్శకుడి పేరును కూడా చెక్కుతారు. జోచిమ్ ట్రియర్ వంటి గ్లోబల్ దర్శకుల పోరాటానికి ఇది దక్కిన విజయంగా చెప్పవచ్చు . ఈ మార్పులు సినిమా రంగంలో పారదర్శకతను పెంచడమే కాకుండా, ప్రాంతీయ సినిమాలకు అంతర్జాతీయ వేదికపై మరింత గుర్తింపు తెచ్చేలా ఉన్నాయని సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు..
