- వాటిలో ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫోర్డ్ రేంజ్ ఫెసిలిటీస్
- ఒక్కో వర్సిటీకి మూడేండ్లలో రూ.200 కోట్లు
- కేజీ టు పీజీ.. అన్నీ ఇక ‘ఎకో ఫ్రెండ్లీ’ క్యాంపస్‌లే..
- రూమ్‌లో ముగ్గురే స్టూడెంట్లు.. హాస్టళ్లలో వాషింగ్ మెషిన్లు
- తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ 2025–47లో కీలక ప్రతిపాదనలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీల రూపురేఖలు త్వరలోనే మారనున్నాయి. తొలుత ఉస్మానియా, జేఎన్టీయూలను ‘మోడల్ వర్సిటీలు’గా ఎంపిక చేసి, స్టాన్‌ఫోర్డ్, కేంబ్రిడ్జ్ వర్సిటీల రేంజ్‌లో డెవలప్ చేయనున్నారు. మరోపక్క బట్టి చదువులకు స్వస్తి పలికి.. బ్రెయిన్ కు పదును పెట్టేలా కొత్త విద్యావిధానం రెడీ చేస్తున్నారు. రాష్ట్రంలోని కేజీ నుంచి పీజీ దాకా వసతులు, చదువు చెప్పే పద్ధతులను పూర్తిగా మార్చాలని సర్కారు డిసైడ్ అయింది. ఇందులో భాగంగా ‘తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ 2025–2047’లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ జోయస్ లర్నింగ్ ఎన్విరాన్మెంట్ కోర్ కమిటీ డ్రాఫ్ట్ ను రూపొందించింది.
సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా వర్సిటీల్లో వసతులు కల్పించాలని డిసైడ్ అయింది. ముందుగా జేఎన్టీయూ, ఓయూల్లో ‘యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడ్రనైజేషన్ ఫండ్’ కింద ఒక్కో వర్సిటీకి మూడేండ్లలో రూ.200 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇకపై వర్సిటీలన్నీ ‘క్లోజ్డ్ క్యాంపస్’లుగా మార్చనున్నారు. తద్వారా వర్సిటీల్లో బయటివాళ్ల పెత్తనం లేకుండా స్టూడెంట్లకు సేఫ్టీ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.
ఇక నుంచి కొత్తగా వచ్చే వర్సిటీలకు కనీసం 100 ఎకరాల స్థలం ఉండాల్సిందేనని రూల్ పెట్టనున్నారు. స్టూడెంట్స్ కోసం కట్టే బిల్డింగులు కనీసం 150 ఏండ్లు చెక్కు చెదరకుండా ఉండేలా హైక్వాలిటీతో కట్టేలా చర్యలు చేపట్టనున్నారు. క్యాంపస్ లలో సోలార్ పవర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉండనున్నది. 2040 నాటికి కాలుష్య రహిత (నెట్ జీరో) క్యాంపస్ లుగా మార్చేలా ప్లాన్ రెడీ చేశారు.
బట్టీ చదువులు బంద్
కొత్త విద్యా విధానంలో ఇప్పటిదాకా ఉన్న బట్టీ చదువులకు ఫుల్ స్టాప్ పెట్టి, క్రియేటివిటీకి, స్కిల్స్‌కు పెద్దపీట వేయనున్నారు. ఎల్ అండ్ టీ రిపోర్ట్ ప్రకారం.. 2026 నాటికి దేశంలో 80 లక్షల మంది స్కిల్డ్ వర్కర్ల కొరత రాబోతున్నది. అందుకే డిగ్రీలు చేతికిచ్చే పట్టాలు కాకుండా.. బతుకును చూపించే చదువులు ఉండాలని ఈ పాలసీ స్పష్టం చేసింది. దీనికిగానూ కేజీ నుంచి పీజీ దాకా స్టూడెంట్స్ హ్యాపీగా, ఎంజాయ్ చేస్తూ నేర్చుకునేలా సిస్టమ్ మారాలని ప్రతిపాదించారు. వర్సిటీల్లో పనిచేసే స్టాఫ్, ఫ్యాకల్టీ పిల్లలను చూసుకునేందుకు క్యాంపస్‌ల్లోనే ‘చైల్డ్ కేర్ సెంటర్స్’ పెట్టనున్నారు.
హాస్టల్ రూములో ముగ్గురే..
రాబోయే కొత్త విద్యావిధానంతో హాస్టల్ స్టూడెంట్ల కష్టాలకు ఇక చెక్ పడనున్నది. ఒక గదిలో ముగ్గురు స్టూడెంట్లకే పర్మిషన్ ఉండనున్నది. హాస్టళ్లలో స్టీమ్ కుకింగ్ సిస్టమ్స్, వాషింగ్ మిషన్లు, హైజీనిక్ టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక, చదువుతో పాటు ఫిట్‌నెస్ కోసం క్యాంపస్‌లలో స్విమ్మింగ్ పూల్స్, ఇండోర్ స్టేడియంలు, యోగా సెంటర్లు, యాంఫీ థియేటర్లు కట్టాలని పాలసీలో పెట్టారు. కొత్తగా వచ్చే ప్రైవేట్ వర్సిటీలు కూడా మూడేండ్లలో కనీసం 25% మంది పిల్లలకు హాస్టల్ సౌకర్యం కల్పించాల్సిందే.
క్లాస్‌కో టీచర్
స్కూళ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోనూ గట్టి నిబంధనలు తేవాలని నిర్ణయించారు. అర్బన్ ఏరియాలో 1,500 మంది పిల్లలున్న స్కూలుకు 3 నుంచి 4 ఎకరాలు, రూరల్‌లో అయితే 5 ఎకరాల జాగా ఉండాలని ప్రతిపాదనలు రెడీ చేశారు. బిల్డింగులు జీ+2 పద్ధతిలో ఉండాలి. టీచర్లు పిల్లలకు కేవలం పాఠాలు చెప్పడమే కాదు.. ‘మెంటార్లు’గా మారి గైడ్ చేయాలి. బడి ఆవరణలో పచ్చదనం, ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్లు కంపల్సరీ. ప్రతి క్లాస్‌కు ఒక డెడికేటెడ్ టీచర్ ఉండాల్సిందేనని ప్రపోజల్స్ రెడీ చేశారు.
స్కిల్స్ కు ప్రయార్టీ..
కొత్త విద్యావిధానంలో విద్యార్థులకు మార్కులు, ర్యాంకులు కాకుండా.. బయటికొస్తే ఉద్యోగం చేసే సత్తా ఉందా లేదా అన్నదే ఇకపై కొలమానంగా మారున్నది. ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల్లో ఇండస్ట్రీలకు కావాల్సిన స్కిల్స్ నేర్పించేందుకు ప్రత్యేక ల్యాబ్‌లు, ఇంక్యుబెషన్ సెంటర్లు పెట్టనున్నారు. చదువు ఒత్తిడి తగ్గించడానికి ప్రతి కాలేజీలో ‘మైండ్ ఫుల్ నెస్ కార్నర్స్’, ‘హ్యాపీనెస్ జోన్స్’ఉంటాయి. స్విమ్మింగ్ పూల్స్, ఇండోర్ స్టేడియాలు, జిమ్ లు, యోగా సెంటర్లు కంపల్సరీ.
ఆర్ట్స్, మ్యూజిక్, కల్చరల్ ఈవెంట్స్ కోసం ఓపెన్ థియేటర్లు, ఆడిటోరియాలు కట్టాలి. ‘టీచింగ్ లెసన్స్’ నుంచి ‘ఇన్‌స్పైరింగ్ లెర్నింగ్’ దిశగా మన చదువులు సాగాలని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది. 2047 నాటికి తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ ఎడ్యుకేషన్ హబ్‌గా నిలపాలన్నదే ఈ పాలసీ టార్గెట్ అని ప్రకటించింది.
