ఉస్మానియా అధ్యాపకుల సమస్యలపై సీఎస్ సోమేష్ కుమార్‭తో చర్చ

ఉస్మానియా అధ్యాపకుల సమస్యలపై సీఎస్ సోమేష్ కుమార్‭తో చర్చ

పెండింగ్‭లో ఉన్న ఉస్మానియా యూనివర్శిటీ అధ్యాపకుల సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు పడింది. ఇప్పటికే పలుమార్లు యూనివర్శిటీ, ప్రభుత్వ యంత్రాంగంతో సంప్రదింపులు జరిపిన ఓటా ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్ తో భేటీ అయ్యారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రొఫెసర్ జి.మల్లేశం నేతృత్వంలోని ఓటా ప్రతినిధుల బృందం..బీఆర్కే భవన్‭లోని సీఎస్ కార్యాలయంలో సోమేష్ కుమార్‭తో అధ్యాపకుల సమస్యలపై చర్చించారు. సీపీఎస్ అమలు లేదా ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. గత కొన్నేళ్లుగా పెన్షన్ విషయంలో అధ్యాపకులు ఆందోళనకు గురవుతున్నారని.. వెంటనే సీపీఎస్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ విషయమై సానుకూలంగా స్పందించిన సోమేష్ కుమార్ చర్యలు తీసుకోవాల్సిందిగా ఫైల్‭ను విద్యాశాఖ కార్యదర్శికి బదిలీ చేశారు.

యూనివర్శిటీల్లో పని చేస్తున్న అధ్యాపకుల వయోపరిమితిని యూజీసీ నిబంధనల మేరకు 65 ఏళ్లకు పెంచాలని కూడా సీఎస్ సోమేష్ కుమార్  ‭కు విజ్ఞప్తి చేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సహా అనేక రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాల్లో 65ఏళ్ల వయోపరిమితిని అమలు చేస్తున్న విధానాన్ని వివరించారు. పాత సర్వీస్‭ను ఉగ్యోగుల సర్వీస్ తో కలిపేందుకు ఉన్న అడ్డంకులను తొలగించాలని ఓటా ప్రతినిధులు ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వయోపరిమితి, పాత సర్వీస్ విషయమై నిర్ణయం తీసుకుంటామని ఓటా ప్రతినిధులకు సీఎస్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య బీమా సౌకర్యాన్ని ఉస్మానియా యూనివర్శిటీ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని..ఇందుకు సంబంధించిన ఆరోగ్య కార్డులను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్ షిప్పుల విషయమై ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి పేరుతో అధ్యాపకులు, విద్యార్థులకు ఉత్తమ పరిశోధనా అవార్డులు ప్రకటించాలని ఓటా ప్రతినిధులు ప్రతిపాదించారు. ఫలితంగా పరిశోధనలో పోటీ పెరగటంతో పాటు..ప్రభుత్వ ప్రోత్సాహంతో అధ్యాపకులు, విద్యార్థులకు మరింత ఉత్సాహం ఏర్పడుతుందని వివరించారు. ఫెలోషిప్, స్కాలర్ షిప్, అవార్డుల విషయంలో పూర్తి వివరాలతో రావాలని సీఎస్ ఓటా ప్రతినిధులకు సూచించారు.