ఓయూ కాంట్రాక్ట్ అధ్యాపకుల ధర్నా

ఓయూ కాంట్రాక్ట్ అధ్యాపకుల ధర్నా

హైదరాబాద్: ఓయూ వీసీ రవీందర్ బాండ్ అగ్రిమెంట్ పేరుతో తమపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఓయూ కాంట్రాక్ట్ అధ్యాపకులు మండిపడ్డారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు అమలు చేస్తున్న బాండ్ అగ్రిమెంట్  ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓయూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎ.పరుశురాం, కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ ధర్మతేజ మాట్లాడుతూ... చట్టవ్యతిరేకమైన బాండ్ అగ్రిమెంట్ పేరుతో అక్రమంగా ఉద్యోగాల నుంచి తొలగించాలనే వీసీ కుట్రలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అడ్డుకుందని తెలిపారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేస్తుంటే... మరోవైపు ఓయూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగ భద్రతకు భంగం కలిగేలా బాండ్ అగ్రిమెంట్ ఇవ్వాలని ఓయూ వీసీ నిర్ణయించడం దారుణమన్నారు.

25 ఏళ్లుగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నామని గుర్తు చేశారు. తప్పని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయిస్తే న్యాయస్థానం బాండ్ అమలును నిలిపివేయాలని ఆదేశాలిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును గౌరవించి,అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని వీసీకి సూచించారు. యూనివర్సిటీని వీసీ ప్రొఫెసర్ రవీందర్ నియంతృత్వ ధోరణి నుంచి విముక్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తక్షణమే వీసీని రీకాల్ చేసి యూనివర్సిటీని కాపాడాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు విజ్ఞప్తి చేశారు.