పాడువడ్డ బిల్డింగుల్లో ఓయూ హాస్టళ్లు

పాడువడ్డ బిల్డింగుల్లో ఓయూ హాస్టళ్లు
  • నేటికీ నిజాం నాటి గుర్రాలషెడ్లే దిక్కు
  • ఎప్పుడు కూల్తయో తెల్వని స్థితిలో పలు బిల్డింగ్స్
  • కొత్తగా కట్టిన హాస్టళ్లు ఐదు మాత్రమే
  • ఇద్దరుండే రూమ్ ​ఐదారుగురు స్టూడెంట్లకు కేటాయింపు
  • దుర్భర పరిస్థితుల్లో ఉంటున్నరు
  • సౌలత్​లు లేక టీవీ హాల్​లో నిద్ర
  • లేడీస్ హాస్టల్​లో వాష్ రూంలకు, వాటర్​కు తీవ్ర అవస్థలు

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా వర్సిటీలో హాస్టళ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. సౌలత్ లు లేక స్టూడెంట్లు సమస్యలతో సావాసం చేస్తున్నారు. ఎప్పుడు కూల్తయో తెల్వని బిల్డింగ్​లు, పెచ్చులు రాలిపడే పైకప్పులు, బండలు పగిలిపోయిన ఫ్లోర్, పాకురు పట్టిన గోడలు, పైప్​లైన్ లీకులు, చుట్టూ పారే డ్రైనేజీతో హాస్టళ్లు ఘోరంగా తయారయ్యాయి. ఓయూలోని అన్ని హాస్టళ్లది ఇదే దుర్భర పరిస్థితి. దీంతో దాదాపు ఏడు వేల మంది స్టూడెంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు గర్ల్స్ హాస్టళ్లలో వాష్ రూమ్​లు సరిగా లేక, తీవ్రమైన నీటి ఎద్దడితో అమ్మాయిలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
1940 నుంచి అవే భవనాలు...
ఓయూ క్యాంపస్​లోని ఈ-1,ఈ-2, డీ, టెక్నాలజీ హాస్టల్ భవనాలు ఒకప్పుడు గుర్రాల కోసం నిర్మించిన రేకుల షెడ్లు. 1918లో యూనివర్సిటీ స్థాపించినప్పుడు నగరంలో అందుబాటులో ఉన్న భవనాల్లో కొనసాగించారు. 1934లో వర్సిటీ ఇపుడున్న క్యాంపస్​కు వచ్చింది. అప్పుడు ఈ షెడ్లను మెడికల్​ కాలేజీ ల్యాబ్​ల కోసం వాడుకున్నారు. తర్వాత మెడికల్ కాలేజీ కోఠికి మారిపోయింది. దాంతో ఆ షెడ్లను1940 లో హాస్టళ్లుగా మార్చారు. అప్పటి నుంచి అందులోనే కొనసాగుతున్నాయి. పట్టుకుంటే ఊడిపోయే డోర్లు, కిటికీలు, ఎప్పుడు పెచ్చులూడి ఊడుతుందో తెలియని పైకప్పు. పాత కాలపు ఫ్యాన్లు ఊగుతుంటే కింద పడతాయేమోనని భయపడాల్సిన పరిస్థితి. కప్​ బోర్డులు లేవు. ఇద్దరు ఉండాల్సిన రూంలో ఐదారుగురు ఉంటున్నారు. హాస్టళ్లలో సరిపడా బాత్​రూంలు లేక విద్యార్థులు ఆరు బయటే స్నానం చేయాల్సి వస్తోంది. మూతపడ్డ ‘ఏ’ -హాస్టల్.. పాడుబడిన ‘బీ’- -హాస్టల్ ఓయూ ప్రస్తుత క్యాంపస్​కు మారినప్పుడు ఆర్ట్స్ కాలేజీతో పాటు స్టూడెంట్ల కోసం ఏ- హాస్టల్ (గోదావరి) , బి హాస్టల్ (కృష్ణవేణి) నిర్మించారు. 

ఈ హాస్టల్లో పలువురు ప్రముఖులు ఉండేవారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు బీ హాస్టల్​లోనే ఉండి చదువుకున్నారు. అలాంటి హాస్టళ్లు ఇప్పుడు శిథిలావస్థకు చేరాయి. పైకప్పు పెచ్చులూడిపడి పలువురు స్టూడెంట్లు గాయపడుతున్నారు. దీంతో 2016లో దాన్ని పూర్తిగా మూసివేశారు. బీ -హాస్టల్​కు రిపేర్లు చేసి స్టూడెంట్లకు వసతి కల్పించారు. అయినాస్టూడెంట్లు భయంభయంగా ఉంటున్నారు. ఓల్డ్ పీజీ, మంజీరా హాస్టళ్లలో చాలా గదులు కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. బాత్ రూమ్​ల పైపులు పగిలిపోయి ఎప్పుడూ లీక్ అవుతూనే ఉంటాయి. రీసెర్చ్ స్టూడెంట్లు ఉండే హాస్టళ్లలో బాత్రూమ్​లు కంపు కొడుతున్నాయి.
లేడీస్ హాస్టళ్లు మరీ దారుణం..
ఓయూలో నాలుగు బ్లాక్​లలో లేడీస్ హాస్టళ్లు ఉన్నాయి.  ఒక్కో బ్లాక్ లో వందకు పైగా గదులు ఉన్నాయి. పీహెచ్ డీ విద్యార్థుల కోసం విడిగా మరో 150 గదులు ఉన్నాయి. కొన్ని బ్లాకుల్లో కోఠి విమెన్ కాలేజ్, నిజాం కాలేజీ స్టూడెంట్లకు వసతి కల్పించారు. దీంతో రూములు సరిపోక ఇద్దరు ఉండాల్సిన గదుల్లో ఆరుగురు ఉంటున్నారు. బెడ్లు లేక ఫ్లోర్ పైనే పడుకుంటున్నారు. అయినా రూమ్​లు చాలక టీవీ హాలులో 60 మంది స్టూడెంట్లు షెల్టర్​ పొందారు. చలికి తట్టులేక చీరలను అడ్డంగా పరదా కట్టుకొని నిద్రపోతున్నారు. లేడీస్ హాస్టల్ మెయిన్ బిల్డింగులో నిర్వహణ సరిగా లేక చాలా రూమ్​లు శిథిలావస్థకు చేరుకున్నాయి. అమ్మాయిలకు సరిపడా బాత్ రూమ్ లు లేవు. వాష్ రూమ్​ల కోసం గంటల తరబడి క్యూలు కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని వాష్​ రూంలకు లోపల గడియలు కూడా లేవు. నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఈ కష్టాలు పడలేక నీళ్ల కోసం స్టూడెంట్లు ఎన్నో సార్లు వీసీ చాంబర్ ముందు ధర్నాలు చేశారు. అయినా సమస్య మాత్రం తీరలేదు.
26 హాస్టళ్లు.. వేల మంది విద్యార్థులు
ఓయూలో మొత్తం 26 హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో నాలుగు గర్ల్స్ హాస్టల్స్. మిగతావి బాయ్స్ హాస్టల్స్. మొత్తం 26 హాస్టళ్లలో ఐదు మాత్రమే కొత్త బిల్డింగ్ లలో ఉన్నాయి. మిగతావన్నీ పాత భవనాలే. వాటిలో చాలా వరకు పాడుబడి కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. అన్ని హాస్టళ్లలో కలిపి 6,692 మంది స్టూడెంట్లు ఉన్నారు. ఇందులో 3,987 మంది అబ్బాయిలు, 2,705 మంది అమ్మాయిలు వసతి 
పొందుతున్నారు.
పత్తాలేని కొత్త హాస్టల్ బిల్డింగ్​లు
కూలిపోయేలా ఉన్న  రేకుల షెడ్లు ఈ1, ఈ2, డీ, టెక్నాలజీ హాస్టళ్ల ను తొలగించి వాటి స్థానంలో కొత్త బిల్డింగ్​లు కట్టాలని ప్రొఫెసర్ రామచంద్రం వీసీగా ఉన్న టైమ్(2016–2019)​లో ప్రతిపాదనలు చేశారు. అందుకు రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని నిర్ణయించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రపోజల్ అడుగు ముందుకు పడలేదు. కొత్త వీసీగా ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ బాధ్యతలు చేపట్టి 5 నెలలు దాటినా కొత్త హాస్టల్ బిల్డింగ్స్ నిర్మాణంపై ఊసెత్తడం లేదని విద్యార్థి నేతలు అంటున్నారు. వర్సిటీలోకి బయటివాళ్ల ఎంట్రీని నిషేధిస్తూ వివిధ సంస్కరణలు ప్రవేశపెడుతున్న ఆయన స్టూడెంట్లకు ఎంతో అవసరమైన హాస్టళ్ల గురించి మాట్లాడకపోవడం బాధాకరం అంటున్నారు. కోర్సుల ఫీజులు కూడా భారీగా పెంచారనీ, హాస్టళ్లలో సౌలత్​లు మాత్రం మరిచారని అంటున్నారు.
అన్నీ సమస్యలే..
లేడీస్ హాస్టల్ ప్రారంభించినప్పటి నుంచే అనేక సమస్యలు ఉన్నాయి. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. నలుగురికి కేటాయించాల్సిన రూమును 8 మందికి కేటాయిస్తున్నారు, స్ట్రెంత్ కు సరిపడా బాత్రూం సదుపాయాలు లేవు. ఉన్నవి కూడా శుభ్రంగాఉంచడం లేదు. మెస్​లో మంచి ఫుడ్ ఉండడం లేదు. వేరే మార్గం లేక ఇక్కడే ఇబ్బందులు పడుతూ ఉండాల్సి వస్తోంది. - ఝాన్సీ, రీసెర్చ్ స్కాలర్, సోషియాలజీ
అధ్వాన్నంగా హాస్టళ్లు..
వందేండ్ల వర్సిటీ సమస్యల వలయంలో కూరుకు పోయింది. పేరుకు 20 హాస్టళ్లు ఉన్నా ఒక్క హాస్టల్లో కూడా సరైన సౌలత్​లు లేవు. రీసెర్చ్ స్టూడెంట్ల హాస్టళ్లు మరీ అధ్వాన్నంగా మారాయి. ఎన్ఆర్ఎస్ హాస్టల్లో వాష్ రూమ్​లు కంపు కొడుతున్నాయి. ఫుడ్​లో  నాణ్యత లేదు. పురుగులు వస్తున్నా పట్టించుకోవడం లేదు. - శ్రీనివాస్, రీసెర్చ్ స్కాలర్ 
శిథిలావస్థలో ఉన్నాయ్​
వర్సిటీ హాస్టళ్లు చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. రిపేర్లు లేక పైకప్పు, గోడల పెచ్చులూడాయి. బాత్రూంలు సరిగ్గా లేవు. వాటర్ ప్రాబ్లమ్ ఉంది. కరోనా తర్వాత హాస్టళ్లు ప్రారంభించినా ఇంకా అనేక సమస్యలున్నాయి. కొందరికి అడ్మిషన్ ఉన్నా హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వట్లేదు. ఇంకొన్ని రోజులు చూసి సమస్యలు తీరకపోతే ఆందోళన చేపడతాం. మాకు అంతకుమించి 
వేరే మార్గం లేదు. - సత్య నెల్లి, స్టూడెంట్

కొత్త హాస్టల్ బిల్డింగ్స్ కట్టాలె
కూలిపోయేలా ఉన్న హాస్టళ్లను తొలగించి కొత్త బిల్డింగ్​లు కట్టాలని అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. 21 పాయింట్ల ఫార్మూలతో రిఫార్మ్స్ అంటూ హడావిడి చేస్తున్న వీసీ ఇప్పటి వరకు స్టూడెంట్ల సంక్షేమానికి ఏం ఫార్మూలా అనుసరిస్తారో చెప్పలేదు. ఆయన బాధ్యతలు చేపట్టి 6 నెలలవుతున్నా హాస్టళ్లలో సదుపాయాల కల్పించలేదు.  - పడిగిపల్లి శ్రీహరి, స్టూడెంట్