పీహెచ్​డీ స్కాలర్లకు  ‘కేసీఆర్​ ఫెలోషిప్​’

పీహెచ్​డీ స్కాలర్లకు  ‘కేసీఆర్​ ఫెలోషిప్​’
  • సర్కారుకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిపాదన
  • ఏ ఫెలోషిప్​ రానోళ్లకు నెలకు రూ.10 వేల స్టైపెండ్​

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఏ ఫెలోషిప్​ రాని పీహెచ్​డీ స్కాలర్లకు ‘కేసీఆర్​ డాక్టోరల్​ ఫెలోషిప్​’ పేరిట స్టెపెండ్​ ఇచ్చేందుకు ఉస్మానియా యూనివర్సిటీ కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగా ఒక్కో స్టూడెంట్​కు నెలకు రూ.10 వేల స్టైపెండ్​ ఇచ్చేలా సర్కారుకు ప్రతిపాదనలు పంపింది. దీనికి సర్కారు పెద్దలు కూడా సూచనాప్రాయ అంగీకారం తెలిపారని, బడ్జెట్​లో పెట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 10 వేల మంది పీహెచ్​డీ స్కాలర్లున్నారు. పరిశోధనలకు నేషనల్​ ఫెలోషిప్​ పేరిట ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులకు స్టైపెండ్​ ఇస్తున్నారు. జూనియర్​ రీసెర్చ్​ ఫెలోషిప్​ (జేఆర్​ఎఫ్​) కూడా ఇస్తున్నారు. గతంలో ఎక్కువమందికి ఫెలోషిప్​ వస్తుండగా.. వివిధ కారణాలతో వారి సంఖ్య ఏటా తగ్గిపోతోంది. దీంతో కొన్ని సెంట్రల్​ వర్సిటీలు సొంతంగా ఫెలోషిప్​లు ఇస్తున్నాయి. అదే విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని ఇటీవల జరిగిన వీసీల మీటింగ్​లో సర్కారుకు ఓయూ ప్రతిపాదించింది. మంత్రి సబితా రెడ్డి, సీఎస్​ సోమేశ్​కుమార్​, ఉన్నత విద్యా మండలి చైర్మన్​ లింబాద్రికి ఫెలోషిప్​ గురించి వివరించింది. ఫెలోషిప్​కు కేసీఆర్​ పేరు పెడుతుండడంతో అందరూ అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో ఏండ్ల నుంచి ప్రాజెక్టు రిపోర్టులను సబ్​మిట్​ చేయని వారందరి అడ్మిషన్లను క్యాన్సిల్​ చేసి.. మార్చి 31లోగా పీహెచ్​డీ స్కాలర్ల సంఖ్యను ఓయూ అధికారులు పైనల్​ చేయనున్నారు. ఫెలోషిప్​కు బడ్జెట్​లో సర్కారు ఆమోదం తెలిపితే.. లెక్కతేలిన స్కాలర్లకు ఫెలోషిప్​ను అందించనున్నారు. కాగా స్కాలర్​షిప్​లను, మెస్​ చార్జీలను పెంచాలని ఓయూ అధికారులు కోరుతున్నారు.