
- టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వెబ్ సైట్ లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఓటీఆర్ ఐడీ ద్వారా నిమిషాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఓటీఆర్‌లో మార్పులు చేసుకోవాలని, ఒకటి నుంచి ఏడో తరగతి వరకు విద్యార్హతలు నమోదు చేయాలని సూచించారు. చివరి నిమిషంలో నమోదు చేస్తే సమస్యలు తలెత్తే ప్రమాదముందన్నారు.
రిజిస్ట్రేషన్ ఇట్ల...
టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ‘‘న్యూ రిజిస్టేషన్’’పై క్లిక్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే, దానికి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసి.. దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత సమాచారం, చిరునామా, ఈ-మెయిల్ ఐడీ, 1నుంచి 7వ తరగతి వరకు 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలు, విద్యార్హతలు నమోదు చేయాలి. ఫొటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. ఈ వివరాలన్నీ నమోదు చేసి, సబ్మిట్ చేసినంక టీఎస్‌పీఎస్సీ ఐడీ వస్తుంది. తర్వాత ఓటీఆర్ పీడీఎఫ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి. సబ్మిట్ చేయడం కన్నా ముందుగానే లాగ్‌అవుట్ అయితే మళ్లీ మొదటి నుంచి చేయాల్సి ఉంటుంది.
ఓటీఆర్ ఎడిట్ ఇలా...
వెబ్‌సైట్‌లో ఎడిట్ ఓటీఆర్‌పై క్లిక్ చేయాలి. టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేశాక ఫోన్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేశాక.. ఎడిట్ చేయాల్సిన వివరాలు మార్చి.. 1 నుంచి 7వ తరగతి వరకు 33 జిల్లాల ప్రాతిపదికన వివరాలు, విద్యార్హతలు నమోదు చేయాలి. ఫొటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. సబ్మిట్ చేశాక జనరేట్ అయ్యే ఓటీఆర్ పీడీఎఫ్ కాపీని డౌన్ లోడ్ చేసుకోవాలి.