లిపి లేని భాషలకు లిపి సృష్టించాలి : ప్రొఫెసర్ జి. నరేశ్ రెడ్డి

లిపి లేని భాషలకు లిపి సృష్టించాలి : ప్రొఫెసర్ జి. నరేశ్ రెడ్డి
  • ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్​ రెడ్డి
  • ఓయూ లింగ్విస్టిక్స్ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు షురూ 

హైదరాబాద్​సిటీ, వెలుగు:  ఓయూ లింగ్విస్టిక్స్ డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలో భారతీయ భాషా సమితి సహకారంతో ‘భారతీయ భాషా పరివార్’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు మంగళవారం ఆర్ట్స్ కాలేజీలో ప్రారంభమైంది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి. నరేశ్ రెడ్డి మాట్లాడారు. లిపి లేని భాషలకు లిపి సృష్టించే బాధ్యత భాషా పరిశోధకులు తీసుకోవాలని కోరారు. నేటి ఆధునిక కాలంలో నిరంతర అధ్యయనం లేకపోతే, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని, అలాంటి వారిని నిరక్షరాస్యులుగా కూడా అనవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇంజినీరింగ్, టెక్నాలజీ విద్యతో పాటు, సామాజిక, భాష శాస్త్రాలు నేటి సమాజానికి అవసరమని స్పష్టం చేశారు. భాష లేకపోతే సమాజం చీకట్లో ఉంటుందని ఆర్ట్స్ కాలేజీ డీన్ ప్రొఫెసర్ లింగప్ప గొనాల్ అన్నారు.ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొ. సీ కాసీం మాట్లాడుతూ.. భారతీయ ఆత్మ ఇంగ్లిష్ మీడియంతో వ్యక్తం కాలేదని జాతీయ విద్యా విధానంలో పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. గోండి, లంబాడా, చెంచు భాషలకు లిపి లేదని, అలాంటి భాషలకు లిపి తయారు చేయగలిగేది భాషా శాస్త్రవేత్తలే అని వివరించారు.