ఎన్టీఆర్ విగ్రహం తొలగించాలి.. లేదంటే మరో మిలియన్ మార్చ్: ఓయూ స్టూడెంట్ జేఏసీ

ఎన్టీఆర్ విగ్రహం తొలగించాలి.. లేదంటే మరో మిలియన్ మార్చ్: ఓయూ స్టూడెంట్ జేఏసీ
  • ఓయూ స్టూడెంట్ జేఏసీ హెచ్చరిక

ఉప్పల్​, వెలుగు: హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని వెంటనే తొలగించాలని, లేదంటే మిలియన్ మార్చ్ తరహాలో ఉద్యమిస్తామని ఓయూ స్టూడెంట్ జేఏసీ నాయకుడు టి.కె. శివప్రసాద్ హెచ్చరించారు. ఓయూలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్రం ఏర్పడి 13 ఏండ్లు గడుస్తున్నా తెలంగాణ వ్యతిరేక శక్తుల ఆనవాళ్లు ఇంకా కొనసాగడం బాధాకరమన్నారు.

స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ, కాళోజీ నారాయణ రావు, ప్రొఫెసర్ జయశంకర్ వంటి మహనీయుల విగ్రహాలను కాదని, ఆంధ్రుల విగ్రహాలు ఏర్పాటు చేయడంలో ఉన్న మతలబేందో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు, ఆంధ్ర పెత్తందారుల అడుగులకు మడుగులొత్తుతూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.

ఆంధ్ర పాలకులు చెప్పినట్లుగా పాలన సాగిస్తూ ఉద్యమకారులను సీఎం అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇటువంటి నిర్ణయాలు మానుకోకుంటే విద్యార్థులు, తెలంగాణ అభిమానుల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.