రెండ్రోజులుగా సాగుతోన్న ఓయూ విద్యార్థినులు ఆందోళన

రెండ్రోజులుగా సాగుతోన్న ఓయూ విద్యార్థినులు ఆందోళన

ఆదివారం తెల్లవారుజాము దాకా ఓయూ విద్యార్థినుల ఆందోళన

ఓయూ, వెలుగు: ఓయూ లేడీస్ హాస్టల్స్​ మూసివేయరాదంటూ విద్యార్థినులు చేపట్టిన ఆందోళన ఆదివారం తెల్లవారుజామున 3గంటల దాకా కొనసాగింది. రెండ్రోజులుగా ఓయూలోని పీజీ ఫస్ట్​ ఇయర్​ విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. మొదటి రోజు ఓయూ లేడీస్ హాస్టల్ ముందు బైఠాయించిన విద్యార్థినులు, వీసీ రావాలని పట్టుబట్టారు. అయితే చీఫ్ వార్డెన్​తో సహా పలువురు అధికారులు వచ్చినా సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో విద్యార్థినులు తిరిగి శనివారం రాత్రి రోడ్డుపై బైఠాయించి ఆదివారం తెల్లవారుజామున 3గంటల దాకా ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ.. వివిధ పోటీ పరీక్షల నోటిఫికేషన్ వెలువడిన టైంలో  హాస్టళ్లు ముసివేయడం సరికాదన్నారు.

ఇప్పటిదాకా సెమిస్టర్ పరీక్షల తర్వాత మెస్ లు మూసివేసి, హాస్టల్స్ తెరిచి ఉంచేవారన్నారు. ఇప్పుడు మాత్రం మెస్ తో పాటు హాస్టళ్లను మూసి వేస్తామని, వెంటనే ఖాళీ చేయాలంటున్నారని పేర్కొన్నారు. పోటీ పరీక్షల కోసం చదువుతున్న తమను అర్ధాంతరంగా హాస్టల్ ఖాళీ చేయమనడం బాధాకరమన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని హాస్టల్స్​ కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న  అధికారులు, హాస్టల్స్​తో పాటు మెస్​ను 24వ తేదీ దాకా కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. ఇదే విషయమై ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మి నారాయణ ను సంప్రదించగా.. హాస్టల్ కొనసాగింపు పై సోమవారం నిర్ణయం తీసుకుంటామన్నారు.