65 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఢిల్లీలో మనదే సర్కార్ : కేసీఆర్

65 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఢిల్లీలో మనదే సర్కార్ : కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్రలో 48, తెలంగాణలో 17 ఎంపీ సీట్లలో గెలిపిస్తే ఢిల్లీలో మన సర్కారే వస్తుందని బీఆర్ఎస్‌‌ చీఫ్, సీఎం కేసీఆర్​ అన్నారు. మహారాష్ట్రలో అన్ని ఎంపీ స్థానాలను గెలిపిస్తే ఢిల్లీ సర్కారును గల్లా పట్టి నిలదీయొచ్చని చెప్పారు. ఈ 65 మంది ఎంపీల మద్దతు లేకుండా రేపు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితే ఉండదని, అప్పుడు దేశానికి నాయకత్వం వహించే అవకాశం మహారాష్ట్రకు వస్తుందని అన్నారు. సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్‌‌లో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు బీఆర్ఎస్‌‌లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానించారు. ‘‘తెలంగాణ మోడల్ మహారాష్ట్రలో అమలు చేయడానికి రూ.49 వేల కోట్లు ఖర్చవుతుంది కాబట్టి తాము అమలు చేయబోమని ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా చెప్తున్నది. 

దేశానికే ఆర్థిక రాజధాని అయిన ముంబై లాంటి నగరం మహారాష్ట్రలో ఉంది. నాగ్​పూర్, పుణెతోపాటు రాష్ట్రంలోని సంపద ఎవరి జేబుల్లోకి వెళ్తున్నదో ఆలోచించండి. మహారాష్ట్రలో ధనం లేక కాదు.. లీడర్లకే మనస్సు లేదు.. చిన్న రాష్ట్రం, తొమ్మిదిన్నర ఏళ్ల క్రితమే ఏర్పడ్డ తెలంగాణలో సాధ్యమైనది.. మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదు? రూ.49 వేల కోట్లు ఖర్చు చేస్తే మహారాష్ట్ర దివాళా తీస్తదని అంటున్నారు. దివాళా తీసేది మహారాష్ట్ర కాదు నేతలు. తెలంగాణ మోడల్​అమలు చేస్తే రైతులకు దివాళీ వస్తది” అని అన్నారు.

రైతుల సమస్యలను పట్టించుకుంటలే

విదర్భ ప్రాంతంలోని బుండానా జిల్లా నుంచి వందశాతం సర్పంచులు వచ్చి బీఆర్ఎస్‌‌లో చేరారని కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని, కానీ రైతుల సమస్యలు పట్టనట్టే ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ‘‘తెలంగాణ రాకముందు రాత్రి పూట కరెంట్​ఇస్తే రైతులు పాములు కాటేసి, ఇంకో కారణాలతో చనిపోయేవారు. వ్యవసాయంలో లాస్ వచ్చి ఆత్మహత్యలు చేసుకునే వారు. ఇప్పుడు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు బాగా తగ్గిపోయాయి. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే నెల, నెలన్నరలోనే మార్పు మీకు కనిపిస్తుంది. సర్పంచులు గ్రామాల్లోకి వెళ్లి ఎంత ఎక్కువ మందికి తెలంగాణ మోడల్ ను చెప్పి బీఆర్ఎస్‌‌ను గెలిపించగలిగితే పార్టీకి అంత ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది” అని చెప్పారు.

 “తెలంగాణలో అసలు కరెంట్​పోనే పోదు.. రైతులు50 హెచ్​పీ మోటార్లు పెట్టుకున్నా.. పది మోటార్లు పెట్టుకున్నా అడిగే వారే లేరు.. చెరువుల్లో పూడిక తీసేసి వాటిని బాగు చేసినం.. చెక్​ డ్యాంలు కట్టినం.. అందుకే దేశంలోనే ఎక్కువ భూగర్భ జలాలు తెలంగాణలో ఉన్నాయి.. దేశంలో 150 ఏళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి.. వాటితో అన్ని రంగాలకు 24 గంటల పాటు కరెంట్ ఇవ్వొచ్చు. అయినా ఇతర దేశాల నుంచి ఎందుకు బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారు.. ఎందుకు ఎక్కువ ధర చెల్లిస్తున్నారు.. అంబానీ, అదానీకి అన్నీ ఇచ్చేసి దేశాన్ని ప్రైవేటీకరణ వైపునకు తీసుకెళ్తున్నారు. దేశంలోని భూములను సస్యశ్యామలం చేయాల్సిన నీళ్లు సముద్రంలోకి పరుగులు పెడుతున్నాయి. తెలంగాణలో తప్ప దేశంలోని ఇంకే రాష్ట్రంలోనూ తాగడానికి కూడా నీళ్లు ఇవ్వడం లేదు. ఈ పరిస్థితి నుంచి మార్పు కోసం బీఆర్ఎస్​కు అండగా నిలవాలి” అని కేసీఆర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్​రావు, మహమూద్​అలీ, ప్రశాంత్​రెడ్డి పాల్గొన్నారు.

మార్పు ఎలా ఉంటుందో చూడండి 

మహారాష్ట్రలో బీఆర్ఎస్‌‌ను గెలిపించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘‘మహారాష్ట్రలో నాలుగైదు పార్టీలున్నాయి.. 50 ఏండ్లు కాంగ్రెస్ ​అధికారంలో ఉంటే, బీజేపీ, శివసేన, ఎన్సీపీలకు పవర్ ఇచ్చారు. కానీ వాటిలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా మీ జీవితాల్లో మార్పులు తేలేదు. బీఆర్ఎస్‌‌ను గెలిపిస్తే రెండేండ్లలోనే వెలుగు జిలుగుల మహారాష్ట్ర ఆవిష్కృతమైతది. మూడేండ్లలోనే మహారాష్ట్రలోని ప్రతి ఇంటికీ నల్లా నీళ్లిస్తాం. ప్రతి మూలకు, ప్రతి ఆదివాసీ ఆవాసానికి నీళ్లు ఇస్తామని హామీ ఇస్తున్నాం. మహారాష్ట్రలో కొత్త కాంతిని తీసుకురావాల్సి ఉంది. 

కర్నాటకలో బీజేపీని ఓడించి కాంగ్రెస్‌‌ను గెలిపించారు. అక్కడ ఏం మార్పు జరిగింది. ‘పిల్లిపోయి కుక్క వచ్చింది.. కుక్కపోయి పిల్లి వచ్చినట్టు’ ఉందే తప్ప మార్పేమీ లేదు. మహారాష్ట్రలో వృద్ధులకు వెయ్యి పింఛన్ ఇస్తున్నారు.. తెలంగాణలో నెలకు రూ.2,016 ఇస్తున్నాం. వ్యవసాయానికి, రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే” అని చెప్పారు. ఒక్కసారి బీఆర్ఎస్‌‌ను గెలిపించాలని, మార్పు ఎలా ఉంటుందో చూడాలని అన్నారు. మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో వచ్చి తెలంగాణలో ప్రాజెక్టులు, ఇంటింటికీ పెట్టిన నల్లాలు, ఇతర అభివృద్ధి పనులు చూసి వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ అంటేనే రైతుల పక్షపాతి అన్నారు. తమ పార్టీని గెలిపిస్తే పేదలు, రైతులకు అండగా నిలుస్తుందని చెప్పారు.