
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో రక్తపాతం ఆగాలంటే దాయాది పాకిస్థాన్‌తో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కోరారు. ఇరు దేశాల మధ్య గొడవను పరిష్కరించుకోవాలన్నారు. కశ్మీర్‌లో రక్తపాతం ఆగాలంటే పాక్‌తో భారత్ చర్చలు జరపాలని లేకపోతే ఇక్కడ మరింత మంది ప్రజలు, పోలీసులు, యువత ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. రీసెంట్‌గా అనంత్‌నాగ్‌లో జరిగిన టెర్రర్ అటాక్‌లో సుహైల్ అహ్మద్ అనే కానిస్టేబుల్ చనిపోయాడు. ఆయన ఫ్యామిలీని ముఫ్తీ కలిశారు. ఈ సందర్భంగా ముఫ్తీ మాట్లాడుతూ.. ‘జమ్మూ కశ్మీర్‌లో హింసకు పాక్ కారణమని, టెర్రరిస్టులకు ఆర్థిక సాయం అందిస్తూ వారిని రెచ్చగొడుతోందని బీజేపీ పదేపదే అంటోంది. అలాంటప్పుడు కనీసం ఒక్కసారైనా పాక్‌తో కేంద్రం చర్చలు జరపాలి. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలి’ అని ముఫ్తీ పేర్కొన్నారు.