చైనాపై ట్రంప్ టారిఫ్‌‌‌‌లతో మన మార్కెట్ డౌన్‌‌‌‌

చైనాపై ట్రంప్ టారిఫ్‌‌‌‌లతో మన మార్కెట్ డౌన్‌‌‌‌
  • 174 పాయింట్లు పడ్డ సెన్సెక్స్‌‌‌‌
  • ఐటీ, ఎఫ్‌‌‌‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు

ముంబై: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  నవంబర్ 1 నుంచి చైనా వస్తువులపై 100 శాతం అదనపు టారిఫ్ ప్రకటించడంతో ఆసియా మార్కెట్లతో పాటే మన మార్కెట్లు కూడా సోమవారం నష్టాల్లో కదిలాయి. ఐటీ, ఎఫ్‌‌‌‌ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 174 పాయింట్లు (0.21శాతం) తగ్గి 82,327.05 వద్ద ముగిసింది. 

ఇంట్రాడేలో 457.68 పాయింట్లు (0.55శాతం) పడిపోయి 82,043.14 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. అయితే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో లాభాల  కారణంగా నష్టాలు కొంత మేర తగ్గాయి. ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ నిఫ్టీ 58 పాయింట్లు (0.23శాతం) తగ్గి 25,227.35 వద్ద ముగిసింది. ఈ ఇండెక్స్‌‌‌‌లోని 50 షేర్లలో 30 షేర్లు నష్టపోగా,  19 లాభపడ్డాయి. ఒక షేరులో ఎటువంటి మార్పులేదు.  

టాటా మోటార్స్ 2.67శాతం తగ్గింది. కమర్షియల్ వెహికల్‌‌‌‌ బిజినెస్ డీమెర్జర్ వలన కంపెనీ షేర్లు పడ్డాయి. ఇన్ఫోసిస్‌‌‌‌, హిందుస్తాన్ యూనిలీవర్‌‌‌‌‌‌‌‌, పవర్ గ్రిడ్‌‌‌‌, భారత్ ఎలక్ట్రానిక్స్‌‌‌‌, ఐటీసీ, అల్ట్రాటెక్‌‌‌‌ సిమెంట్‌‌‌‌, టీసీఎస్‌‌‌‌  కూడా నష్టాల్లో ముగిశాయి.  అదానీ పోర్ట్స్‌‌‌‌, బజాజ్ ఫైనాన్స్‌‌‌‌, బజాజ్ ఫిన్సర్వ్‌‌‌‌, యాక్సిస్ బ్యాంక్ లాభపడ్డాయి.  “యూఎస్–చైనా ట్రేడ్ ఉద్రిక్తతలు కారణంగా పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. 

అయితే భారత ట్రేడ్ ప్రతినిధి బృందం యూఎస్‌‌‌‌కి వెళ్లనున్న వార్తలు మార్కెట్ సెంటిమెంట్‌‌‌‌ను మెరుగుపరిచాయి” అని ఎన్రిచ్‌‌‌‌ మనీ సీఈఓ పొనుముడి ఆర్ అన్నారు.  “యూఎస్‌‌‌‌ అధ్యక్షుడి ప్రకటన తర్వాత టారిఫ్ పెరుగుదల భయాలు ప్రపంచ మార్కెట్లలో నెగెటివ్ సెంటిమెంట్‌‌‌‌ను పెంచాయి.  దీని ప్రభావం  దేశీయ మార్కెట్‌‌‌‌పై కూడా పడింది” అని రెలిగేర్ బ్రోకింగ్ ఎనలిస్ట్ అజిత్ మిశ్రా అన్నారు.  

ఆసియా మార్కెట్లలో కోరియా కొస్పీ, చైనా ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ, హాంకాంగ్ హాంగ్ సెంగ్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌లు సోమవారం  తగ్గాయి. టోక్యో మార్కెట్ సెలవు కారణంగా ఓపెన్ కాలేదు. యూరప్ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి.

ఫ్లాట్‌‌‌‌గా టాటా క్యాపిటల్ లిస్టింగ్‌‌‌‌ 

టాటా క్యాపిటల్ షేర్లు  సోమవారం ఐపీఓ ధర రూ.326తో పోలిస్తే 1.22శాతం పెరిగి రూ.330 వద్ద మార్కెట్‌లో లిస్టయ్యాయి. తర్వాత రూ.332 (1.84శాతం)కు పెరిగాయి. కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ రూ.1.38 లక్షల కోట్లుగా ఉంది.  

రూ.15,512 కోట్ల విలువైన కంపెనీ ఐపీఓ 1.95 రెట్లు సబ్‌‌‌‌స్క్రయిబ్ అయింది. ఇది 2025లో అతిపెద్ద ఐపీఓ. షేర్ ధర పరిధి రూ.310–రూ.326 గా నిర్ణయించారు.  ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ రూల్స్‌ ప్రకారం, అప్పర్ లేయర్ ఎన్‌‌‌‌బీఎఫ్‌‌‌‌సీగా సెప్టెంబర్ 2022లో గుర్తింపు పొందిన టాటా క్యాపిటల్, అప్పటి నుంచి  మూడేళ్లలో  మార్కెట్‌‌‌‌లో లిస్టవ్వాలి.