అణగారిన వర్గాల సాధికారతే..మా ప్రాధాన్యత : ప్రధాని నరేంద్ర మోదీ

అణగారిన వర్గాల సాధికారతే..మా ప్రాధాన్యత :  ప్రధాని నరేంద్ర మోదీ

ఇండోర్ : సమాజంలోని అణగారిన వర్గాలు, పేదలను గౌరవించడం.. వారిని ఎంపవర్ చేయడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో మధ్యప్రదేశ్‌‌‌‌లోని ఇండోర్‌‌‌‌కు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. దీంతో వేలాది మంది ఉపాధికి అవకాశాలు పెరిగాయని తెలిపారు. ఇండోర్‌‌‌‌లోని హుకుమ్‌‌చంద్ మిల్లు వర్కర్లకు రూ.224 కోట్ల నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా సోమవారం వీడియో లింక్ ద్వారా మోదీ మాట్లాడారు. ఈ నిధుల విడుదల వల్ల 4,800 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.  ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఎంపీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని తెలిపారు. ‘‘పేదలు, యువత, మహిళలు, రైతులు.. వీళ్లే పెద్ద కులాలు అని నేను ఎప్పుడూ చెబుతుంటా. పేదలు, అణగారిన వర్గాలను గౌరవించడం, వారికి సాధికారత కల్పించడమే ప్రాధాన్యత” అని ఆయన వివరించారు. 

క్రిస్టియన్ల సహకారాన్ని ఇండియా గర్వంగా గుర్తిస్తున్నది

క్రిస్టియన్ కమ్యూనిటీ సహకారాన్ని ఇండియా సగర్వంగా గుర్తిస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. సమాజానికి దిశానిర్దేశం చేయడంలో, సేవా భావాన్ని అందించడంలో క్రైస్తవ సమాజం పోషించిన పాత్రను కొనియాడారు. క్రిస్మస్ సందర్భంగా ఢిల్లీలోని తన నివాసంలో క్రిస్టియన్ కమ్యూనిటీ సభ్యులతో ఆయన ముచ్చటించారు.

వాజ్‌‌పేయి, మాలవీయకు నివాళి

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌‌పేయి 99వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులర్పించారు. దేశ అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఆయన తన జీవితాంతం పని చేశారని కొనియాడారు. ‘సదైవ్ అటల్’ మెమోరియల్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్, లోక్‌‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులతో కలిసి ఆయన నివాళులర్పించారు. మరోవైపు స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త మదన్ మోహన్ మాలవీయ జయంతి సందర్భంగా ట్విట్టర్‌‌‌‌లో నివాళులు అర్పించారు.