
న్యూయార్క్: ఇండియాతో సంబంధాలు తమకు చాలా కీలకమని, వివిధ రంగాల్లో అభివృద్ధిపై కలిసి ముందుకెళ్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ప్రాధాన్య రంగాల్లో అమెరికాతో కలిసి పని చేస్తున్నామని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చెప్పారు. సోమవారం ఉదయం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్ జీఏ) 80వ సెషన్ సమావేశాల సందర్భంగా ఇరువురు నేతలు భేటీ అయ్యారు.
అనంతరం మార్కో ఈ సమావేశం గురించి ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ‘‘యూఎన్ జీఏ సమావేశాల సందర్భంగా జైశంకర్‌తో సమావేశమయ్యాను. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం, ఇంధనం, ఫార్మాస్యూటికల్స్, క్రిటికల్ మినరల్స్ వంటి రంగాల్లో సహకారంపై చర్చించుకున్నాం. రెండు దేశాల శ్రేయస్సును పెంపొందించుకోవడంపై ఫోకస్ పెట్టాం” అని తెలిపారు.
‘‘ఇండియాతో సంబంధాలు మాకు చాలా ముఖ్యం. వివిధ రంగాల్లో ఉమ్మడి ప్రయోజనాల కోసం భారత్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నాం” అని పేర్కొన్నారు. క్వాడ్ కూటమి ద్వారా ఇండో, పసిఫిక్ రీజియన్ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని కూడా అంగీకారానికి వచ్చామన్నారు. రూబియోతో భేటీ నిర్మాణాత్మకంగా జరిగిందని జైశంకర్ కూడా ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు.
‘‘రూబియోతో భేటీలో ద్వైపాక్షిక అంశాలతోపాటు అంతర్జాతీయ సంక్షోభాలపై చర్చించుకున్నాం. ప్రాధాన్య రంగాల్లో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాం” అని ఆయన పేర్కొన్నారు. కాగా, రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ 50 శాతం టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం పడింది. ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన తర్వాత రెండు దేశాల విదేశాంగ మంత్రులు తొలిసారి భేటీ కావడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.