- బోసిపోయిన ఆఫీస్రూమ్లు.. నిలిచిపోయిన జీతాలు, బిల్లుల ప్రక్రియ
- రోగుల సేవలకూ ఆటంకం
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని 60 మంది సిబ్బందిలో ఏకంగా 54 మందిని జనగణన (సెన్సెస్) విధులకు కేటాయించడంతో ఆసుపత్రి పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది. దీనివల్ల ఓపీ కౌంటర్లు, మందుల కొనుగోళ్లు, అకౌంట్స్ వంటి కీలక విభాగాలు ఖాళీగా కనిపిస్తుండటమే కాకుండా.. డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది జీతాల బిల్లులు, పదవీ విరమణ ఉత్తర్వుల ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఫలితంగా జూన్ 1న వేతనాలు అందడం కష్టమని అధికారులు చెప్తున్నారు.
ఉస్మానియా, నీలోఫర్ ఆసుపత్రులకు మినహాయింపు ఇచ్చి గాంధీ సిబ్బందిని మాత్రమే విధులకు పిలవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూపరింటెండెంట్ వాణి విజ్ఞప్తి మేరకు మినహాయింపు పొందిన పదిమందికి కూడా ఇప్పుడు అధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. రోగుల సేవలకు ఆటంకం కలగకుండా ఆసుపత్రి సిబ్బంది అందరికీ జనగణన విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.
