కూతురిని వేధించాడని కేసు పెట్టిన తండ్రి హత్య

కూతురిని వేధించాడని కేసు పెట్టిన తండ్రి హత్య

యూపీలోని హథ్రాస్‌లో దారుణం చోటుచేసుకుంది. కూతురును వేధించాడని కేసు పెట్టిన వ్యక్తిని నిందితుడు కాల్చి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరవ్ శర్మ అనే వ్యక్తి 2018 జూలైలో సొంత గ్రామానికి చెందిన యువతిని వేధించాడు. దాంతో ఆమె త్రండి.. శర్మపై కేసు పెట్టాడు. పోలీసులు శర్మను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడంతో జైలు శిక్ష పడింది. నెలరోజుల పాటు శిక్ష అనుభవించిన శర్మ.. ఆ తర్వాత బెయిల్ మీద బయటకొచ్చాడు. అప్పటి నుంచి వారి కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం బాధిత యువతి తన సోదరితో కలిసి గుడికి వెళ్లింది. అదే సమయంలో శర్మ భార్య, అత్త కూడా గుడికి వచ్చారు. ఆ సమయంలో ఇరు కుటుంబాలు గొడవపడ్డారు. అంతలోనే అక్కడికొచ్చిన శర్మ, బాధిత యువతి తండ్రి కూడా గొడవలో కలుగజేసుకున్నారు. కోపోద్రిక్తుడైన శర్మ గన్‌తో బాధిత యువతి తండ్రి మీద కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలపాలైన యువతి తండ్రిని ఆస్పత్రి తరలిస్తుండగా మృతిచెందాడు.

తమకు జరిగిన అన్యాయంపై బాధిత యువతి తీవ్రంగా స్పందించింది. ‘నన్ను వేధించినవాడిపై నా తండ్రి కేసు పెట్టాడు. అదే వ్యక్తి ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చి నా తండ్రిని చంపాడు. నాకు న్యాయం జరగాలి. వాడిని కఠినంగా శిక్షించాలి. ఘటన జరిగిన ప్రాంతంలో ఆరుఏడుగురు ఉన్నారు. వారితో నా తండ్రికి ఎటువంటి శత్రుత్వం లేదు. నా త్రండిపై కాల్పలు జరిపింది గౌరవ్ శర్మ. అతడు నా తండ్రి ఛాతీ మీద, నడుము మీద కాల్చాడు. నాకు న్యాయం చేయండి’ అంటూ పోలీస్ స్టేషన్ ముందు అరుస్తూ కన్నీటిపర్యంతమైంది.

ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడి సోదరుడు లలిత్ శర్మను అరెస్ట్ చేసినట్లు యూపీ డీజీపీ తెలిపారు. గౌరవ్ శర్మ కోసం గాలింపు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యానాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను త్వరగా పట్టుకొని శిక్షించాలని అధికారులను ఆదేశించారు. యూపీ కాంగ్రెస్ నాయకులు ఘటనను తీవ్రంగా ఖండించారు. ‘బాధితురాలు నిందితుడి పేరు కూడా చెప్పింది. అతన్ని అరెస్ట్ చేస్తారా? లేక ఏదైనా కుట్ర చేసి అతన్ని కాపాడుతారా?’ అని ట్వీట్ చేశారు. పోలీస్ స్టేషన్ ముందు బాధితురాలు ఏడుస్తూ న్యాయం కోరిన వీడియోను ట్యాగ్ చేశారు.