పాత బస్సులతో తిప్పలు .. గద్వాల డిపోలో 25 నుంచి 30 లక్షల కిలోమీటర్లు తిరిగిన వెహికల్స్

పాత బస్సులతో తిప్పలు .. గద్వాల డిపోలో 25 నుంచి 30 లక్షల కిలోమీటర్లు తిరిగిన వెహికల్స్
  • మార్గమధ్యలో మొరాయిస్తున్నా పట్టించుకోని ఆఫీసర్లు
  • పల్లెలకు బస్సులు అంతంతమాత్రంగా నడిపించడంతో ఇబ్బందులు

గద్వాల, వెలుగు: గద్వాల ఆర్టీసీ డిపోలో పాత బస్సులతో కాలం వెళ్లదీస్తున్నారు. నిబంధనల ప్రకారం 17 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను స్క్రాప్  చేయాలి. కానీ, గద్వాల ఆర్టీసీ డిపోలో 20 లక్షల నుంచి 30 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను కూడా అలాగే నడుపుతున్నారు. వివిధ కారణాలతో పాత వెహికల్స్ ను నడిపిస్తుండడంతో, మార్గమధ్యలో అవి మొరాయిస్తున్నాయి. గద్వాల డిపోలో 100 బస్సులు ఉండగా, వాటిలో 45 ప్రైవేట్, 55 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఈ 55 బస్సుల్లో 29 బస్సుల వరకు కాలం చెల్లినవేనని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. ఇదిలాఉంటే 15 రోజుల కింద గద్వాల ఆర్టీసీ డిపోకు మూడు డీలక్స్  బస్సులు కేటాయించగా, వాటిని తీసుకోకుండా రీప్లేస్  కింద మహబూబ్ నగర్  డిపో నుంచి పాత డీలక్స్  బస్సులను తీసుకున్నారు.

29 బస్సులు స్క్రాప్..

గద్వాల ఆర్టీసీ డిపోలో స్క్రాప్  వెహికల్స్ 29 వరకు ఉన్నాయని కార్మికులు చెబుతున్నారు. ఏపీ22 జడ్0060, 0090, 1896, 0088, 0062, 0096, 0061, 479, 337, 0085, 096, 0075, 1329, 0056, 0034 బస్సులతో పాటు మరికొన్ని స్క్రాప్ కు వచ్చినప్పటికీ వాటిని అలాగే తిప్పుతున్నారని అంటున్నారు. బస్సులు 17 లక్షల కిలోమీటర్లు తిరిగితే రూల్​ ప్రకారం స్క్రాప్ కు వేయాలి. ఆర్టీవో ఆఫీసర్లు వెహికల్స్ ను తనిఖీలు చేసి వాటిని సీజ్ చేయాలి. కానీ, ప్రభుత్వ సంస్థ కావడంతో వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటారు.

కొత్త బస్సులు తీసుకోలే..

గద్వాల ఆర్టీసీ డిపోకు 15 రోజుల కింద మూడు కొత్త డీలక్స్  బస్సులను కేటాయించారు. వాటిని గద్వాల డిపో అధికారులు తీసుకోకుండా, వాటి స్థానంలో మహబూబ్ నగర్  డిపో నుంచి 3 పాత డీలక్స్  బస్సులను తీసుకున్నారు. కొత్త బస్సులు తీసుకుంటే డిపోపై భారం పడుతుందని, ఆదాయ, వ్యయాలకు సంబంధించి ఇబ్బంది వస్తుందని పాత వెహికల్స్  తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ పని చేస్తున్న ఆర్టీసీ అధికారులు ప్రమోషన్లు, ఇతర ప్రయోజనాల కోసం కొత్త బస్సులు తీసుకోలేదని అంటున్నారు. పక్కనే ఉన్న వనపర్తి ఆర్టీసీ డిపోలో 20 డీలక్స్  బస్సులు ఉండగా, మొన్నటి వరకు గద్వాల డిపోలో ఒకే డీలక్స్​ బస్సు ఉంది. 10 రోజుల కింద మహబూబ్ నగర్  నుంచి వచ్చిన మూడు బస్సులతో కలుపుకుంటే నాలుగుకు చేరాయి.

మొరాయిస్తున్న బస్సులు..

గద్వాల ఆర్టీసీ డిపోలో ఎక్కువగా పాత బస్సులే ఉండడంతో మార్గమధ్యలో మొరాయిస్తున్నాయి. ఇటీవల గద్వాల నుంచి ఆరగిద్దకు వెళ్లే బస్సు డీజిల్  పైపు పగిలిపోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రైవేట్  వెహికల్స్ లో వెళ్లాల్సి వచ్చింది. రాయచూరుకు వెళ్లే బస్సు గోన్పాడు దగ్గర ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.

పల్లెలకు ఆర్టీసీ బస్సులు అంతంతే..

హైదరాబాద్, కర్నూల్, రాయచూర్, వనపర్తి, అయిజ ప్రాంతాలకు బస్సులు ఎక్కువగా నడుపుతున్న అధికారులు, పల్లెలకు మాత్రం అంతంతమాత్రంగానే నడిపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సులు లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరోవైపు ఆర్టీసీ డిపోలో బస్సులకు తగిన సిబ్బంది కూడా లేరు. 520 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా, 480 మాత్రమే ఉన్నారు. డిపోలో కండక్టర్ల సమస్య తీవ్రంగా వేధిస్తోంది.

ఎప్పటికప్పుడు బస్సులను తొలగిస్తాం..

స్క్రాప్  బస్సులను ఎప్పటికప్పుడు తొలగిస్తాం. పై ఆఫీసర్ల సూచనల మేరకే మూడు డీలక్స్  బస్సులను తీసుకున్నాం. స్క్రాప్  కింద వెళ్లే బస్సుల స్థానంలో ఆరు బస్సులు కూడా వచ్చాయి. లక్ష కిలోమీటర్లు అటు ఇటు ఉన్న వాటిని మాత్రమే తిప్పుతున్నాం. సిబ్బంది కొరత రాకుండా చూస్తున్నాం.
- సునీత, డీఎం