V6 News

ఓయూ చీఫ్ వార్డెన్ కార్యాలయం వద్ద ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా

ఓయూ చీఫ్ వార్డెన్ కార్యాలయం వద్ద ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా

పాము కాటుతో మృతి చెందిన ఓయూ మంజీర హాస్టల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని నాగోల్ కవిత (46) కుటుంబాన్ని ఆదుకోవాలని ఐఎఫ్‌‌టియూ నాయకురాలు పద్మ, సీఐటీయూ నాయకులు మహేందర్ డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి రూ. 25 లక్షలు నష్టపరిహారంతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... ఓయూ చీఫ్ వార్డెన్ కార్యాలయం వద్ద IFTU ఆధ్వర్యంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా.. పద్మ మాట్లాడుతూ...మెడికల్ సౌకర్యం అందలేదని దీంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా.. ఆమె చనిపోవడం బాధాకరమన్నారు. గత 30 ఏళ్ల నుంచి 90 నుంచి 375 వర్కర్స్ పని చేస్తున్నట్లు తెలిపారు. ఔట్ సోర్స్ అనే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అంత్యక్రియల కోసం రూ. 20 వేలు ఇవ్వాలని కోరారు. హాస్టల్స్ ఎంప్లాయిస్ ను యూనివర్సిటీలో భాగంగా చూడాలని కోరుతున్నట్లు తెలిపారు.  సీఐటీయూ నాయకులు మహేందర్ మాట్లాడుతూ.. హాస్పిటల్ సౌకర్యం కల్పించడం లేదని, కట్టుబానిసలుగా కార్మికులు ఇక్కడ పని చేయడం దారుణమన్నారు. సుమతి ఏజెన్సీ కార్మికులను మోసం చేస్తోందని, ఆ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలన్నారు. ఓయూ అధికారుల, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగానే ఆమె మృతి చెందిందని ఆరోపించారు. కవిత అంత్యక్రియల నిమిత్తం ఓయూ చీఫ్ వార్డెన్ రూ. 20,000 అందజేశారు. 



అసలేం జరిగింది ? 
కవిత అనే కాంట్రాక్ట్ ఉద్యోగిని లేడీస్ హాస్టల్లో వంట చేస్తుండగా పాటు కాటు వేసింది. నోటి నుంచి నురగ, రక్తం వస్తున్నా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంతో వేరే హాస్పిటల్కు వెళ్లారు. వారు సైతం ట్రీట్మెంట్ చేయకపోవడంతో చివరకు గాంధీ ఆస్పత్రికి చేరుకునే లోపు కవిత కన్నుమూశారు. లేడీస్ హాస్టల్ లో పలు చోట్ల ఉన్న బొరియల్లో పాములు ఉన్నాయని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సమాచారం. ఇదిలా ఉంటే తన భార్య మృతికి కారణమైన ఓయూ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ మృతురాలు కవిత భర్త పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.