V6 News

ఏప్రిల్ 27 నుంచి రెవెన్యూ, హౌసింగ్ శాఖలపై రివ్యూలు

ఏప్రిల్ 27 నుంచి రెవెన్యూ, హౌసింగ్ శాఖలపై రివ్యూలు
  • ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు పరిష్కరిస్తం
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ప్రజాదర్బార్  ప్రారంభం

ఖమ్మం/ నేలకొండపల్లి, వెలుగు: ఈ నెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ, హౌసింగ్  శాఖలపై కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో రివ్యూ మీటింగ్​లు  నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస​రెడ్డి తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నదే ప్రజా ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని చెప్పారు.

ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా వినూత్నంగా చేపట్టిన 'ప్రజా దర్బార్' కార్యక్రమాన్ని శనివారం పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం రాయగూడెం గ్రామంలో ప్రారంభించారు. సాయంత్రం తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్ లో ఈ ప్రోగ్రాం నిర్వహించారు. ఆయా క్లస్టర్ల పరిధిలోని ప్రజలతో సమావేశమై ఫిర్యాదులు తీసుకున్నారు. వాటి పరిష్కారం కోసం అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. మే నెలలో రెండో విడత ఇండ్లు అందిస్తామని చెప్పారు. ధరణితో ఏర్పడిన సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరిస్తున్నామని, సాదా బైనమా దరఖాస్తులను పరిష్కరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రజలు తమ గోడు చెప్పుకోవడానికి సరైన వేదిక లేక ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. ప్రజా దర్బార్​ను సభలా కాకుండా ప్రతి పంచాయతీకి ఒక గది కేటాయించి అధికారులను అందుబాటులో ఉండేలా చూస్తామని, ప్రజల సమస్యలపై లోతుగా అధ్యయనం చేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో విజయవంతం అయితే భవిష్యత్ లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా దర్బార్ ను అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్​ రాయల నాగేశ్వరరావు, అడిషనల్  కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస్​ రెడ్డి పాల్గొన్నారు.