న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీలోని నిరసన ప్రాంగణమైన జంతర్ మంతర్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. ప్రధాన్ రాజీనామా చేయడంతో సీజేపీ నిరసనకారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహించారు. నృత్యాలు చేస్తూ, కేరింతలు కొడుతూ, త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ.. వందేమాతరం నినాదాలు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలు, పోస్టర్లను ప్రదర్శించారు. ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటూ ప్రజాస్వామ్యం గెలిచింది.. ఇది విద్యార్థుల విజయమని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయడంతో ఇది విద్యార్థుల విజయమని నెటిజన్లు అంటున్నారు. వారు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి రిజైన్ చేయాల్సిందేనని పట్టుబట్టారని, అడ్డంకులు ఎదురైనా అనుకున్నది సాధించారని ప్రశంసిస్తున్నారు. విద్యార్థులు తలుచుకుంటే ఏ ప్రభుత్వమైనా దిగిరావాల్సిందేనని మరోసారి నిరూపించారని అంటున్నారు.
నీట్ పేపర్ లీకేజీ, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. సీజేపీ నిరసనకు మద్దతుగా ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు.
మరోవైపు.. ప్రధాన్ రాజీనామా చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు జులై 20న కాక్రోచ్ పార్టీ పార్లమెంట్ మార్చ్ (చలో సంసద్) కార్యక్రమం చేపట్టింది. ఈ చలో పార్లమెంట్ కార్యక్రమం తీవ్ర హింసాత్మకంగా మారింది. సీజేపీ నిరసనకారులపై పోలీసులు దమనకాండ కొనసాగించారు. విద్యార్థులపై విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ ప్రయోగించారు. పోలీసుల దాడిలో పదుల సంఖ్యలో నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిరసనకారులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నాలుగు రోజులుగా పార్లమెంట్‌ను స్తంభింపజేశాయి ప్రతిపక్షాలు. ఓ వైపు సీజేపీ.. మరోవైపు ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వం తీవ్ర ఒత్తడి నెలకొంది. దీంతో చేసేదేమి లేక సీజేపీ, ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.
