సింగరేణిలో దొంగలు పడ్డారు...చర్చలు విఫలమైతే ఆగస్టు 15నుంచి సింగరేణిలో సమ్మె : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

సింగరేణిలో దొంగలు పడ్డారు...చర్చలు విఫలమైతే ఆగస్టు 15నుంచి సింగరేణిలో సమ్మె :   సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో ఆదానీ, అంబానీల రూపంలో దొంగలు పడ్డారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్​ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ అధ్యక్షతన శుక్రవారం రాత్రి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జీఎం ఆఫీస్ గ్రౌండ్​లో జరిగిన సింగరేణి కార్మికుల కవాతు కార్యక్రమానికి ఆయన చీఫ్​గెస్ట్​గా హాజరై మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎంఎండీఆర్ చట్టం వల్ల సింగరేణికి కొత్త గనులు రాకుండా పోయాయన్నారు. దీనికి అనుకూలంగా పార్లమెంట్​లో బీఆర్ఎస్ ఎంపీ కవిత తదితరులు ఓటు వేశారని గుర్తుచేశారు. 

అలాంటి సంఘానికి నేడు కార్మికుల గురించి, ఏఐటియుసి గురించి మాట్లాడే అర్హత లేదని ఘాటుగా విమర్శించారు. కార్మికుల హక్కుల సాధన కోసం 31 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చామని, దీనిపై ఈ నెల 28 న చర్చలు జరుగనున్నాయని చెప్పారు. ఒక వేళ చర్చలు విఫలమైతే ఆగస్టు 15 తర్వాత ఎప్పుడైనా సమ్మెలోకి వెళ్తామని, ఈ సమ్మె ను విజయవంతం చేయడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్, లీడర్లు వై.వీ.రావు, వీరభద్రం, కవ్వంపల్లి స్వామి, కె.రాజారత్నం, జె.రాంచందర్, గంధం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.