V6 News

అధిక సంఖ్యలో యువత ఉద్యోగాలు సాధించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

అధిక సంఖ్యలో యువత ఉద్యోగాలు సాధించాలి :  మంత్రి పొన్నం ప్రభాకర్
  •     మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు

హైదరాబాద్, వెలుగు: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత ఉద్యోగాలను తెలంగాణ యువత అధిక సంఖ్యలో సాధించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఇందుకు రాష్ర్ట  ప్రభుత్వం ‘రాజీవ్ అభయ హస్తం’ పేరుతో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ అర్హత సాధించిన అభ్యర్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ.. తెలంగాణ యువత కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తుందని తెలిపారు. పోటీ పరీక్షల్లో ప్రేరణ కోసం బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ రూపొందించిన ప్రత్యేక గీతాన్ని శనివారం మినిస్టర్ క్వార్టర్స్ లో ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగం ఒక చక్కని అవకాశమని, అలాంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో సివిల్ సర్వీసెస్, గ్రూప్ పరీక్షలు, బ్యాంకింగ్, రైల్వే లాంటి  ఉద్యోగాలకి సంబంధించిన పోటీ పరీక్షల కోచింగ్ కోసం ప్రభుత్వం అభ్యర్థులకు శిక్షణ ఇస్తుందని గుర్తుచేశారు. ఈ శిక్షణను అభ్యర్థులు ఉపయోగించుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని సూచించారు. సివిల్స్ 2025 కోసం 40 రోజుల ‘సంకల్ప సాధన దీక్ష’ పేరిట ప్రత్యేక శిక్షణ, మోడల్ టెస్ట్ నిర్వహణ వంటి అంశాలపై అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.