- ఏజెన్సీలను రద్దు చేసి, నేరుగా ఖజానా ద్వారానే జీతాలు ఇవ్వాలి
- అర్ధనగ్న ప్రదర్శనలు, భిక్షాటనతో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మహాధర్నా
హైదరాబాద్, వెలుగు: దళారీ ఏజెన్సీల దోపిడీ నుంచి తమను రక్షించి, ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో ఔట్సోర్సింగ్ఉద్యోగులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఆందోళన చేపట్టారు. అర్ధనగ్న ప్రదర్శనలు, భిక్షాటన చేస్తూ, ఒంటికాలిపై నిలుచొని నిరసన వ్యక్తం చేశారు. ఏజెన్సీల ద్వారా జీతాల చెల్లింపుల్లో ఆలస్యం, అక్రమ కోతలు, పారదర్శకత లోపంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
చట్టబద్ధంగా దక్కాల్సిన ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు అమలు చేయకపోవడం యంత్రాంగ వైఫల్యమన్నారు. సమాన పనికి సమాన వేతనం నినాదం కాగితాలకే పరిమితమైందని, ఏజెన్సీల వ్యవస్థను వెంటనే రద్దు చేసి ప్రభుత్వ ఖజానా ద్వారా నేరుగా తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని దశల వారీగా క్రమబద్ధీకరించేందుకు పక్కా విధానాన్ని ప్రకటించాలని కోరారు. ప్రతి ఏటా కనీసం రూ.వెయ్యి వార్షిక వేతన వృద్ధిని అమలు చేయాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ధర్నాలో పులి లక్ష్మయ్య, దోయిపడి శ్రీధర్, దుర్గం శ్రీనివాస్, సంతోష్, బాలకృష్ణ రెడ్డి, జ్యోతి తదితరులుఈ పాల్గొన్నారు.
