రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉగ్యోగుల జేఏసీ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: అర్ధాకలితో అలమటిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్ ఎల్బీనగర్ లో రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దాదాపు 5 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీల పెత్తనం పెరిగిపోయి నెల నెలా వేతనాలు సరిగా రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా ఒకే శాఖలో పని చేస్తూ వేరే పని చేయలేక, ఉన్న ఉద్యోగం చేయలేని దుస్థితిలో కొనసాగుతున్నామని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని జేఏసీ కోరింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా 20 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి జేఏసీ నూతన కమిటీని ఏర్పాటు చేశారు.
జేఏసీ నూతన కమిటీ ఇదే..
లక్ష్మణ్(క్రీడల శాఖ), వినోద్, సంతోష్, అరుణ్ కుమార్, నారాయణ, నజీర్, కృష్ణ, శ్రీధర్, జగదీశ్(ఆగ్రోస్), ప్రవీణ్ (అగ్రికల్చర్), సరిత, హేమలత (ఆడిట్ డిపార్ట్‌మెంట్), గోవర్ధన్ (హార్టీ కల్చర్) , బిందు ప్రసాద్, విజయలక్ష్మి, శ్రీకాంత్ గౌడ్, రాజా ప్రసాద్, ప్రవీణ్, జనార్దన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీ నూతన కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.
