
అయోధ్య రామాలయ ప్రారంభానికి వచ్చే అతిథుల కోసం ప్రసాదంగా ఇవ్వడానికి దేశీయ నెయ్యితో 13 లక్షల లడ్డూలును తయారు చేశారు. వీటిని జనవరి 22న రామమందిర ప్రారంభానికి వచ్చే 8 వేల మంది ఆహ్వానితులకు ఇవ్వనున్నారు. శెనగపిండి, పంచదార, డ్రై ఫ్రూట్స్ మిశ్రమంతో ఈ లడ్డూలను తయారు చేశారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ పూర్తయిన వెంటనే దర్శనానికి వచ్చిన భక్తులకు ఈ లడ్డూలను పంపిణీ చేస్తారు. 12 మందికి పైగా ఉద్యోగులు, 24 గంటల పాటు పనిచేసి ఈ లడ్డూలను తయారీలో పాల్గొన్నారు.
ఈ లడ్డూలను మూడు రకాల టిఫిన్ బాక్సుల్లో ప్యాక్ చేస్తారు. 11 లడ్డూలున్న స్టీల్ టిఫిన్ బాక్స్ ప్రాణప్రతిష్టకు వచ్చిన ఆహ్వానితుల కోసం ప్యాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో కూడా వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలకు ఇచ్చే ప్యాక్ లో ఏడు లడ్డూలుంటాయి. ఈ బాక్స్ లపై రామ మందిరం స్టిక్కర్లు ఉంటాయి. ప్రతీ స్టీల్ బాక్సు ఓ బ్యాగులో ప్యాక్ చేయబడుతుంది. ఆ బ్యాగులో లడ్డూలతో పాటు మూడు బుక్ లెట్ లు ఉంటాయి. రామజన్మభూమి మూమెంట్, దేవ్రాహ బాబా ఎలా సహాయం చేశాడు లాంటి వాటికి సంబంధించిన పూర్తిచరిత్ర ఉంటుంది. వీటితో పాటు ఓ అంగవస్త్రం ఉంటుంది.
హైదరాబాద్ నుంచి 1, 265 కిలోల భారీ లడ్డూ
అయోధ్యలోని భవ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ కు చెందిన శ్రీరామ్ క్యాటరింగ్ నాగభూషణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 1,265 కేజీల అఖండ లడ్డూను తయారు చేశారు. రామ మందిర్ ఆలయ ట్రస్ట్ అనుమతితో ఈనెల 22న ఉదయం 5:40 గంటలకు నైవేద్యంగా సమర్పిస్తారు.