- మహాజాతరకు 4 వేలకుపైగా బస్సులు
- ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే సాల్వ్ చేసేందుకు స్పెషల్ టీమ్స్
- మెకానిక్స్, ఎలక్ట్రీషియన్, హెల్పర్ సహా ఐదుగురు సభ్యులతో 36 బృందాల ఏర్పాటు
హనుమకొండ, వెలుగు: మేడారం మహాజాతర ఇంకో నాలుగు రోజుల్లో ప్రారంభంకానుంది. రాష్ట్ర నలుమూలల నుంచి 4 వేల బస్సులతో భక్తులను వన దేవత చెంతకు తరలించేందుకు ఆర్టీసీ రెడీ అయ్యింది. జాతరను విజయవంతం చేయడంలో ఆర్టీసీది ముఖ్య పాత్ర కాగా, నిరంతర సర్వీస్ లతో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సంస్థ సమాయత్తమైంది. జాతర పూర్తయ్యేంత వరకు 24 గంటలపాటు సేవలందించాల్సి ఉండగా, బస్సులు ఎక్కడ మొరాయించినా వెంటనే రిపేర్ చేసేలా స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసింది. వరంగల్ నుంచి మేడారం వరకు ఆర్టీసీ బస్సుల్లో సాఫీగా ప్రయాణం సాగించేందుకు చర్యలు చేపడుతోంది.
ఆర్టీసీ కీలక పాత్ర.. 10,441 మందితో విధులు
రెండేండ్లకోసారి జరిగే మేడారం మహాజాతరకు తెలంగాణతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భక్తులు కోట్లాదిగా తరలివస్తుంటారు. చాలామంది ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు, డీసీఎంలు తదితర వాహనాల్లో జాతరకు వస్తుండగా, మిగతా భక్తులను మేడారం చేరవేసేందుకు ఆర్టీసీ ముఖ్య పాత్ర పోషిస్తుంటుంది. ప్రతి మహాజాతరకు 20 నుంచి 30 లక్షల మంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లోనే వన దేవతల దర్శనానికి తరలివస్తుండగా, మహాలక్ష్మీ స్కీమ్ తో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉండటంతో ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు భక్తుల రాకకు అనుగుణంగా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 51 పాయింట్ల నుంచి 4 వేల బస్సులతో 42 వేలకు పైగా ట్రిప్పులు నడిపించేందుకు రెడీ అయింది. జాతర ప్రాంగణంలో 50 ఎకరాల్లో 50కిపైగా క్యూలైన్లతో టెంపరరీ బస్టాండ్ ఏర్పాటు చేసింది. కాగా, భక్తుల రద్దీకి అనుగుణంగా 24 గంటల పాటు బస్సులు తిప్పేందుకు ఆర్టీసీకి చెందిన దాదాపు 10,441 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఇందులో 7 వేల మంది డ్రైవర్లు ఉండగా, 1,811మంది కండక్టర్లు, 759మంది భద్రతా సిబ్బంది, ఇతర నిర్వహణ సిబ్బంది, సూపర్‌వైజర్లు, 153 మంది ఆఫీసర్లు ఉన్నారు.
ఎలక్ట్రిక్ బస్సులు దూరం..
రాష్ట్రంలోని హైదరాబాద్ తోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు వందల కిలోమీటర్లు ప్రయాణించి మేడారం చేరుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అడపాదడపా బస్సులు మొరాయించే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణికులను సాఫీగా తల్లుల గద్దెల చెంతకు చేర్చడంలో ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ తగిన చర్యలు చేపట్టింది. ఈ మేరకు మేడారం జాతరకు ఎలక్ట్రిక్ వాహనాలను దూరం పెట్టింది. పూర్తిగా డీజిల్ వాహనాలనే తిప్పనుండగా, బస్సులు ఎక్కడ మొరాయించినా వెంటనే రిపేర్లు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.
36 బృందాలతో నిరంతర పర్యవేక్షణ..
ప్రయాణికులకు నిరంతరం సేవలందించేందుకు చర్యలు చేపట్టిన ఆఫీసర్లు బస్సులు ఎక్కడ మొరాయించినా వెంటనే రిపేర్ చేసేలా మొత్తంగా 36 టీమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి టీమ్ లో ఒక మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఇద్దరు అసిస్టెంట్లు, ఒక ఇన్చార్జి ఆఫీసర్ ఉంటారు. ఇందులో 13 మొబైల్ టీమ్స్ వరంగల్ నగర శివారులోని గుడెప్పాడ్ నుంచి మేడారం వరకు డే అండ్ నైట్ తిరుగుతూ సేవలందిస్తుంటాయి. ఎక్కడైనా బస్సు మొరాయించినా, ఇంకా ఇతర సమస్యలేమైనా ఎదురైనా వెంటనే పరిష్కరిస్తుంటాయి. ఇంకో 15 చోట్ల మెయింటెనెన్స్ టీమ్స్ సేవలందిస్తాయి. అక్కడ కూడా మెకానిక్స్, ఎలక్ట్రీషియన్స్ తో పాటు స్పేర్ పార్ట్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
ఇక ఇంకో 8 బైక్ టీమ్స్ కూడా విధుల్లో ఉండనున్నాయి. ఈ బైక్ టీమ్ లో ఒక మెకానిక్, హెల్పర్ ఉంటారు. వీళ్లు మేడారం నుంచి తాడ్వాయి, తాడ్వాయి నుంచి పస్రా మధ్య తిరుగుతుంటారు. ఎక్కడైనా బస్సులు జామ్ అయినా, బస్సులు ఆగిపోయినా వెంటనే అటెండ్ అయి సమస్యలు సాల్వ్ చేస్తుంటారు. వీళ్లంతా ఈ నెల 26 నుంచి పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించనున్నారు. కాగా, ఆర్టీసీ బస్సులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే అక్కడికి చేరుకుని పరిష్కరించేలా సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇచ్చామని, ఓవరాల్ గా 36 బృందాలతో నిరంతరం పర్యవేక్షిస్తామని అధికారులు చెబుతున్నారు.
ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ సేవలు..
మేడారం మహాజాతరకు భక్తులను తరలించేందుకు ఆర్టీసీ తరఫున ఏర్పాట్లు పూర్తి చేశాం. మహాలక్ష్మీ పథకం వర్తిస్తుండటంతో ఆర్టీసీ సేవలు వినియోగించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఈ మేరకు భక్తులకు ఎలాంటి అంతరాయం లేని సేఫ్ జర్నీని అందించేందుకు ఏర్పాట్లు చేశాం. ఎక్కడ ఇబ్బందులు తలెత్తినా వెంటనే సాల్వ్ చేసేలా సిబ్బందిని కేటాయించాం. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే భక్తులు గద్దెల దగ్గరికి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలి. - డి.విజయభాను, ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్
