రాత్రికి రాత్రి 50 బస్తాల ధాన్యం చోరీ

రాత్రికి రాత్రి 50 బస్తాల ధాన్యం చోరీ

తెలంగాణలో చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు అరిగోసలు పడుతున్నారు. కేసీఆర్ సర్కారు వడ్ల కొనుగోలులో ఆలస్యం చేస్తుండడంతో రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులుగా పోసుకుని పడిగాపులు కాయాల్సివస్తోంది. మరోవైపు అకాల వర్షాలు కురుస్తుండడంతో వడ్లు మొలకెత్తుతున్నాయి. వాటిని ప్రభుత్వం కొంటదో కొనదో తెలియక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులకు కొత్త కష్టం వచ్చింది. రాత్రికి రాత్రే దొంగలు వడ్లను చోరీ చేస్తున్నారు. నిన్న రాత్రి ఈ జిల్లాలో ఈ తరహా ఘటనలు రెండు వేర్వేరు చోట్ల జరిగాయి. 

 రాజాపేట మండలం పాముకుంటలో కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని నిన్న రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన మాచర్ల కొండయ్య, జంగా మల్లయ్య అనే రైతుల ధాన్యం గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఇద్దరి వడ్ల కుప్పల నుంచి 50 సంచుల వడ్లను ఎత్తికెళ్లినట్లు రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వడ్లు కొనాలని వేడుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దొంగలు ఎత్తుకెళ్లడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోనే రామన్నపేటలోనూ వడ్ల చోరి జరిగింది. కల్లాల్లో ఆరబోసిన వడ్లను నిన్న అర్ధరాత్రి దొంగలు చోరీ చేశారు. కొండే ముత్యాలు అనే రైతు ధాన్యం కుప్పలోంచి 50 బస్తాలకుపైగా వడ్లను దొంగలించారు. ఇవాళ ఉదయం ధాన్యాన్ని గమనించిన రైతు చోరీ జరిగినట్లు గుర్తించాడు. చేతికొచ్చిన ధాన్యాన్ని దొంగలు ఎత్తుకెళ్లడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.