- కండరాలు అలసిపోయి ‘రాబ్డోమయోలిసిస్’
- గంటన్నర వ్యాయామం చేసి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న యువకుడు
- కాపాడిన ఏఐఎన్‌యూ డాక్టర్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జిమ్ లో మితిమీరిన ఎక్సర్ సైజ్ లు చేయడం వల్ల ప్రాణాలకే ముప్పని డాక్టర్లు చెప్తున్నారు. తక్కువ టైంలో కండలు పెంచాలనే ఆరాటంతో ‘రాబ్డోమయోలిసిస్’ అనే ప్రమాదకరస్థితికి వెళ్తారని, దీంతో కిడ్నీలు దెబ్బతిని ప్రాణాపాయ పరిస్థితి తలెత్తుతుందని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల వీరి దగ్గరకు వచ్చిన ఓ పేషెంట్‌ను ఏఐఎన్యూ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ దీపక్ రాగూరి, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ క్రాంతి కుమార్ చికిత్స చేసి కాపాడారు. అతి వ్యాయామం వల్ల ఏం జరుగుతుందో వివరించారు.
90 నిమిషాల నాన్‌స్టాప్ ఎక్సర్సైజ్..
హైటెక్ సిటీలోని ఏఐఎన్‍యూ దవాఖానలో ఇటీవల ఓ యువకుడు(25 ) కండరాల నొప్పితో జాయిన్ అయ్యాడు. త్వరగా కండలు పెంచాలనే ఆతృతలో జిమ్‌కు వెళ్లిన మొదటి రోజే నాన్‌స్టాప్ గా 90 నిమిషాల పాటు ఎక్సర్సైజ్చేశానని డాక్టర్లకు చెప్పాడు.
రెండు రోజుల తర్వాత కండరాల నొప్పులు మొదలయ్యాయని వివరించాడు. జిమ్చేసినప్పుడు ఇలాంటి నొప్పులు కామనే కదా అని సీరియస్‌గా తీసుకోలేదని.. కానీ, రాను రాను తీవ్రమయ్యాయని పేర్కొన్నాడు. తెల్లవారాకా మూత్రం కోలా రంగులోకి మారిందన్నాడు.
పరిస్థితి విషమించడంతో దవాఖానకు వచ్చినట్లు చెప్పాడు. పరిస్థితిని గుర్తించిన డాక్టర్లు ఎమర్జెన్సీలో చేర్పించారు. అన్ని టెస్టులు చేయగా అతని శరీరంలో కండరాల విచ్ఛిన్నం వల్ల విడుదలయ్యే ‘మయోగ్లోబిన్’ స్థాయిలు పెరిగి, కిడ్నీలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీనినే ‘ఎక్సర్‌సైజ్ ఇండ్యూస్డ్ రాబ్డోమయోలిసిస్’ అంటారని పేర్కొన్నారు.
రాబ్డోమయోలిసిస్ అంటే శరీరంలోని కండరాలు (మజిల్స్) వేగంగా దెబ్బతిని బ్రేక్ అవుతాయి. దాంతో అందులోని మయోగ్లోబిన్ అనే ప్రోటీన్ రక్తంలోకి విడుదలవుతుంది. క్రమంగా ఇది కిడ్నీల్లోని మైక్రోవెసిల్స్ ను మూసేస్తుంది. దీనివల్ల కిడ్నీలు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా దెబ్బతింటాయి. సకాలంలో గుర్తించకపోతే డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీస్తుందని డాక్టర్లు వివరించారు.
కోలా యూరిన్ అంటే ?
కోలా యూరిన్ అనేది మూత్రం కోలా గాఢమైన గోధుమ లేదా నలుపు రంగులో రావడం. శరీరంలో ఏదో సమస్య ఉన్నదని సూచించే ముఖ్యమైన లక్షణమిది. ముఖ్యంగా కండరాలు దెబ్బతినే పరిస్థితి మయోగ్లోబిన్ అనే ప్రోటీన్ మూత్రంలోకి రావడం వల్ల ఈ రంగు మార్పు కనిపిస్తుంది.
కాలేయ సమస్యలు, రక్తం మూత్రంలో కలవడం (హీమాచ్యూరియా), తీవ్రమైన డీహైడ్రేషన్ వల్ల కూడా కోలా రంగు మూత్రం రావచ్చు. ఇలాంటి లక్షణం కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇలా కనిపిస్తే కిడ్నీలపై ప్రభావం చూపించే ప్రమాదం ఉంది.
ప్రమాద సంకేతాలు
- మూత్రం కోలా లేదా టీ రంగులోకి మారడం
- సాధారణ నొప్పి కంటే భిన్నంగా, కండరాల వాపు రావడం.
- విపరీతమైన అలసట లేదా కండరాల్లో శక్తి లేకపోవడం.
- రోజువారీ కంటే మూత్రం రావడం తగ్గిపోవడం.
- వికారం లేదా వాంతులు
జిమ్‌కు వెళ్లే వారికి సూచనలు
- నెమ్మదిగా ప్రారంభించండి. మొదటి రోజే కఠినమైన వ్యాయామాలు వద్దు. క్రమక్రమంగా తీవ్రతను పెంచాలి.
- నీరు ఎక్కువగా తాగాలి. వ్యాయామానికి ముందు, తర్వాత శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి.
- విశ్రాంతి అవసరం.కండరాలు కోలుకోవడానికి వారంలో కనీసం ఒక రోజైనా విశ్రాంతినివ్వాలి.
- తీవ్రమైన నొప్పి ఉంటే వ్యాయామం ఆపేయాలి. పెయిన్ కిల్లర్స్ వేసుకుని మరీ జిమ్ చేయడం ప్రాణాంతకం.
