- 30 రోజులు అభ్యంతరాల స్వీకరణకు గడువు
హైదరాబాద్, వెలుగు: సాదాబైనామా నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. సాదాబైనామాలో గతంలో ఉన్న నిబంధన 6(3) ప్రకారం భూమి హక్కుల కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు దరఖాస్తుదారుడితో పాటు భూమిని బదిలీ చేసే వ్యక్తి కూడా అఫిడవిట్ సమర్పించాల్సి ఉండేది. అయితే ఈ నిబంధన వల్ల క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. సీసీఎల్ఏ ప్రతిపాదనల మేరకు మార్పులు చేపట్టింది.
ఇకపై దరఖాస్తుదారుడు ఇచ్చే స్వయం ధ్రువీకరణ అఫిడవిట్ మాత్రమే సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, దరఖాస్తుదారుడు సమర్పించే సమాచారం లేదా పత్రాలు తప్పుగా ఉన్నట్లు తేలితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది.
అలాంటి సందర్భాల్లో సదరు సాదాబైనామా రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయడంతో పాటు చెల్లించిన ఫీజులు, స్టాంపు డ్యూటీని జప్తు చేస్తారు. అంతేకాకుండా, తప్పుడు పత్రాలు సమర్పించిన వ్యక్తిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తారు. మరోవైపు, దరఖాస్తు చేసుకున్న తర్వాత భూ భారతి పోర్టల్‌లో ఆ వివరాలను నమోదు చేసే ముందు 30 రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ కోసం గడువు ఇస్తారు. ఈ 30 రోజుల వ్యవధిలో ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే, ఆ భూమికి సంబంధించిన హక్కుల నమోదు ప్రక్రియను నిలిపివేస్తారు.
ఈ సవరణలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలా ఉండగా సాదాబైనామా కింద గతంలో మొత్తం 9,00,880 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో 9,00,566 మంది దరఖాస్తుదారులకు ఇప్పటికే రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. తహసీల్దార్ స్థాయి నుంచి ఆర్డీవో లాగిన్‌కు 6,65,249 దరఖాస్తులు వెళ్లాయి. అయితే, ఆఫిడవిట్, సాంకేతిక నిబంధనల కారణాల వల్ల గతంలో కేవలం అతి తక్కువ సంఖ్యలో మాత్రమే ఆమోదం పొందాయి.
ఐదు ఎకరాల్లోపు ఉచితంగా..
ఐదు ఎకరాల్లోపు ఉన్న సాదాబైనామా (అన్ రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్స్) దరఖాస్తులను క్రమబద్ధీకరించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో అందిన ‘ఫామ్- X’దరఖాస్తులను తెలంగాణ భూ భారతి నిబంధనలు- 2025 ప్రకారం పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారం.. ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు లభించనుంది.
హైదరాబాద్ జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ దరఖాస్తులను పరిశీలించి, క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పాత నిబంధనలకు, కొత్తగా అమల్లోకి వచ్చిన భూ భారతి చట్టానికి మధ్య ఉన్న వ్యత్యాసాలను తొలగిస్తూ, ప్రక్రియను సరళతరం చేసినట్లు రెవెన్యూ శాఖ వెల్లడించింది.
