ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్: అక్కడ టచ్ చేస్తే బాబ్ అల్-మందేబ్ జలసంధి క్లోజ్

ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్: అక్కడ టచ్ చేస్తే బాబ్ అల్-మందేబ్ జలసంధి క్లోజ్

అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో అట్టుడుకుతున్న గల్ఫ్ యుద్ధం ఇప్పుడు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. ఇరాన్ భూభాగంపై, ముఖ్యంగా దక్షిణ ద్వీపాలపై భూతల దాడులకు దిగితే ప్రపంచ వాణిజ్యానికి వెన్నెముకగా ఉన్న 'బాబ్ అల్-మందేబ్' జలసంధిని మూసివేస్తామని ఇరాన్ కొత్త హెచ్చరిక జారీ చేసింది. తమను ఇంకా రెచ్చగొడితే వెంటనే యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఈ వ్యూహాత్మక జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని టెహ్రాన్ స్పష్టం చేసింది.

ఎర్ర సముద్రం.. గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌ను కలిపే బాబ్ అల్-మందేబ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ఒకవేళ హౌతీలు దీనిపై పట్టు సాధిస్తే.. అంతర్జాతీయ వాణిజ్యం స్తంభించిపోవడమే కాకుండా చమురు సరఫరా ఆగిపోయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తామన్న హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఇరాన్ ఈ సముద్ర దిగ్బంధనం అస్త్రాన్ని బయటకు తీయటం ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. 

ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచే అన్సరుల్లా దళాలు హై అలర్ట్‌లో ఉన్నాయని ఇరాన్ మీడియా సంస్థ పేర్కొంది. శత్రువును దారికి తెచ్చుకోవడానికి జలసంధిని నియంత్రించడం అవసరమని ఇరాన్ భావిస్తోంది. గతంలోనే ఇజ్రాయెల్ నౌకలపై దాడులు చేసి, వాటిని ఆఫ్రికా మీదుగా చుట్టు తిరిగి వెళ్లేలా చేసిన అనుభవం హౌతీలకు ఉంది. ఇప్పుడు నేరుగా అమెరికా యుద్ధ నౌకలనే లక్ష్యంగా చేసుకునేందుకు వారు సిద్ధమయ్యారు.

యుద్ధం 27వ రోజుకు చేరుకున్నా ఇరాన్ ఏమాత్రం మెత్తబడకపోవటం అమెరికాకు మరోపక్క కునుకులేకుండా చేస్తోంది. నమ్మకమైన హామీలు లేకుండా కాల్పుల విరమణకు లేదా చర్చలకు తావులేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ తేల్చి చెప్పేశారు. అమెరికా-ఇజ్రాయెల్ దురాక్రమణకు మా సమాధానం కేవలం ప్రతిఘటన మాత్రమే అని ఆయన ప్రకటించారు. అమెరికా ఒకవైపు కాల్పుల విరమణ కోసం ఒత్తిడి తెస్తూనే.. మరోవైపు ఇజ్రాయెల్‌తో కలిసి దాడులు చేయడాన్ని ఇరాన్ తప్పుబడుతోంది. మొత్తానికి ఇరాన్ భూభాగంపై కాలు మోపాలని చూస్తే సముద్ర మార్గాలను దిగ్బంధించి ప్రపంచాన్నే సంక్షోభంలోకి నెట్టేస్తామన్న ఇరాన్ హెచ్చరిక ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాను ఆత్మరక్షణలో పడేసింది.