- ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ జాబ్స్ కంటే ఎక్కువ జీతాలు
- 8.60 శాతం పెరిగిన కనీస వేతనాలు
- వర్క్ ఇండియా రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ:భారత కార్మిక మార్కెట్‌లో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాల కంటే బ్లూ కాలర్ పనుల్లో జీతాలు వేగంగా పెరుగుతున్నాయి. వర్క్ ఇండియా రిపోర్ట్ ప్రకారం..2024తో పోలిస్తే 2025లో జీతాల్లో మార్పు స్పష్టంగా కనిపించింది. సాధారణంగా వైట్ కాలర్ ఉద్యోగాలకే ఎక్కువ జీతాలు వస్తాయనే అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది. అయితే ప్రస్తుతం డిమాండ్ ఆధారంగా చూస్తే కొన్ని బ్లూ కాలర్ వృత్తుల్లో వేతనాల వృద్ధి రేటు ఎక్కువగా ఉంది.
బ్లూ కాలర్ ఉద్యోగుల సగటు కనీస వేతనాలు ఏడాది కాలంలో 8.60 శాతం పెరిగాయి. 2024లో రూ.14 వేల నుంచి 2025 నాటికి ఇవి రూ.15 వేల పైకి చేరుకున్నాయి. అదే సమయంలో వైట్ కాలర్ ఎంట్రీ లెవల్ జీతాలు 6.75 శాతం మాత్రమే పెరిగాయి. డెలివరీ బాయ్స్, డ్రైవర్లు వంటి విభాగాల్లో 16 శాతం వరకు జీతాల పెరుగుదల కనిపించింది.
మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా 11 శాతం వృద్ధి కనిపించింది. నైపుణ్యం ఉన్న కార్మికులకు ఉన్న విపరీతమైన డిమాండ్ దీనికి ప్రధాన కారణం. శారీరక శ్రమతో కూడిన పనులు చేసే వారిని బ్లూ కాలర్ ఉద్యోగులు అంటారు. డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మెకానిక్ లు ఈ కోవలోకి వస్తారు. గనుల్లో పనిచేసే వారు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు కూడా బ్లూ కాలర్ ఉద్యోగులే!
ఐటీ రంగమే టాప్
బ్లూకాలర్ ఉద్యోగులకు కూడా ఐటీ రంగమే అత్యధిక కనీస వేతనాలను అందిస్తోంది. ఈ రంగంలో జీతాలు 15 శాతం వృద్ధితో రూ.19 వేల నుంచి రూ.21 వేల మధ్యకు చేరుకున్నాయి. లాజిస్టిక్స్, మొబిలిటీ విభాగాల్లో నిపుణులైన కార్మికులకు అవకాశాలు పెరుగుతున్నాయి. మెట్రో నగరాల్లో సగటు కనీస వేతనం రూ.17 వేల కంటే ఎక్కువగా ఉండగా, చిన్న నగరాలు ఈ విషయంలో వెనకబడి ఉన్నాయి. కార్మికుడు నివసించే ప్రాంతం కూడా జీతాల నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తోంది.
వేతనాలు పెరుగుతున్నా మహిళలు, పురుషుల మధ్య వ్యత్యాసం కొనసాగుతోంది. మగవాళ్ల సగటు కనీస వేతనం 8.24 శాతం పెరిగి రూ.16 వేలకు చేరితే, మహిళల వేతనం కేవలం 5.67 శాతం పెరిగి రూ.13 వేల వద్దే ఉంది. చాలా ఉద్యోగాల్లో మహిళలు తక్కువ జీతాలు పొందుతున్నారని వర్క్ ఇండియా పేర్కొంది. దాదాపు 18 లక్షల మంది యజమానుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ రిపోర్ట్‌ను తయారు చేశారు.
