జీహెచ్ఎంసీని మజ్లిస్ కు అప్పగించే కుట్ర : పాల్వాయి హరీశ్ బాబు

జీహెచ్ఎంసీని మజ్లిస్ కు అప్పగించే కుట్ర : పాల్వాయి హరీశ్ బాబు
  •     మిత్రపక్షానికి కాంగ్రెస్​ మేలు.. రాజకీయ ప్రేరేపిత విభజన: పాల్వాయి హరీశ్​ బాబు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్​ఎంసీని కాంగ్రెస్​ పార్టీ మిత్రపక్షమైన మజ్లిస్​కు కట్టబెట్టేందుకే మూడు కార్పొరేషన్లుగా విడగొట్టిందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్​ బాబు ఆరోపించారు. ఇది రాజకీయ ప్రేరేపిత విభజన అని విమర్శించారు. జీహెచ్​ఎంసీ విభజన అశాస్త్రీయంగా జరిగిందన్నారు. ఒక్కో డివిజన్​లో సగటున 30 వేల జనాభా ఉండాలని.. కానీ, విభజనలో మాత్రం ఒక డివిజన్​లో 82 వేలు, ఇంకో డివిజన్​లో మాత్రం 12 వేలు ఉందని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్​ పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

జీహెచ్​ఎంసీని రాజ్యాంగానికి విరుద్ధంగా మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేశారన్నారు. ఒకపక్క జనగణన జరుగుతున్నప్పుడు విభజన ఎలా చేస్తారని ప్రశ్నించారు. 2005 డిసెంబర్​ నుంచి 2027 మే వరకు బౌండరీలు మార్చొద్దని సెన్సస్​ డైరెక్టర్​ జనరల్​ ఆదేశాలున్నా.. విభజన ఎలా చేశారని నిలదీశారు. హుస్సేన్​ సాగర్​ను కొబ్బరి నీళ్లతో నింపుతామని గతంలో ఒక పెద్ద మనిషి (కేసీఆర్​ను ఉద్దేశించి) చెప్పారని, ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఫాంహౌస్​కే పరిమితమయ్యారని హరీశ్​బాబు విమర్శించారు. 

ఇప్పుడున్న నాయకులేమో మూసీని గోదావరి నీళ్లతో నింపుతమంటున్నారని.. మరి, ఎవరిని నమ్మాలని ప్రశ్నించారు. అనంతరం డ్రగ్స్​ అంశంపై పాల్వాయి హరీశ్​ బాబు, పొన్నం ప్రభాకర్​ మధ్య వాగ్వాదం నడిచింది. రాష్ట్రంలో డ్రగ్స్​ వినియోగం భారీగా పెరిగిందని, స్కూళ్లు, పాన్​షాపుల వరకు పాకిందని హరీశ్​ బాబు విమర్శిస్తే.. అసలు గుజరాత్​లోని పోర్టుల నుంచే ఇక్కడికి అవి వస్తున్నాయని, కేంద్ర హోం శాఖ ఏం చేస్తున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్​ నిలదీశారు.