ముగ్గురి ప్రాణాలు తీసిన ఓవర్ స్పీడ్

ముగ్గురి ప్రాణాలు తీసిన ఓవర్ స్పీడ్

పర్వతగిరి(సంగెం), వెలుగు: ఓవర్ స్పీడ్​ ముగ్గురి ప్రాణాలు తీసింది. వరంగల్ రూరల్​ జిల్లా సంగెం టౌన్​చివరలోని చెరువు కట్ట దగ్గర బుధవారం జరిగిన ఈ యాక్సిడెంట్ వివరాలు సంగెం ఎస్సై సురేశ్​ మీడియాకు తెలిపారు. సంగెం టౌన్ కు చెందిన హంస సంపత్​(41) తన బైక్ మీద మరదలు స్వప్న, ఆమె కూతురు హర్ష(4)ను బుధవారం గాంధీనగర్ కు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో తిమ్మాపురం నుంచి సంగెం వైపు పల్సర్​ బైక్​ ​ మీద వస్తున్న రక్తపు శివకుమార్, భువనగిరి హరీశ్(25)​లు టిప్పర్ ను ఓవర్ టేక్ చేసి ఎదురుగా వస్తున్న సంపత్​ బైక్​ను ఢీ కొట్టారు. దీంతో రెండు బైక్​ల మీదున్న ఐదుగురికి గాయాలు కాగా.. చిన్నారి హర్ష అక్కడికక్కడే చనిపోయింది. మిగతావారిని 108 అంబులెన్స్ లో, ఎస్సై వెహికల్​లో  వరంగల్ ఎంజీఎం కు తీసుకెళ్లగా.. ట్రీట్​మెంట్ పొందుతూ సంపత్, హరీశ్ చనిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేశ్​ తెలిపారు.

కారు పల్టీ కొట్టి ఇద్దరు మృతి

పెనుబల్లి, వెలుగు: ఏడుగురు ప్రయాణిస్తున్న కారు పల్టీ కొట్టి ఇద్దరు చనిపోగా.. ఓ చిన్నారి కండిషన్ సీరియస్ గా ఉంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లి దగ్గర నేషనల్ హైవేపై బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఏపీలోని ప్రకాశం జిల్లా యడవల్లికి చెందిన చల్ల మల్లికార్జున రెడ్డి వ్యాపారం చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి ఒడిశాలో నివాసముంటున్నారు. డెలివరీకి పుట్టింటికి వచ్చిన భార్యతో పాటు బంధువు ధనలక్ష్మి, కుటుంబ సభ్యులను తిరిగి కారులో ఒడిశా తీసుకెళ్తుండగా బుధవారం ఉదయం పెనుబల్లి దగ్గర కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. మల్లికార్జునరెడ్డి, ధనలక్ష్మి అక్కడికక్కడే చనిపోగా.. అతని తల్లి, భార్యాపిల్లలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. తీవ్రగాయాలైన చిన్నారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.