- ఆ టైమ్‌లోనే లక్షల కోట్లు వసూలు చేశారా?
- సీఎం సోదరులకు సంబంధం ఎక్కడిది?
- ఒప్పందాలపై ఆధారాలుంటే బయటపెట్టు
- జూబ్లీహిల్స్‌లో ఓటమితో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరని ఫైర్
హైదరాబాద్, వెలుగు:రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ అన్నీ అబద్ధాలే చెప్పారని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. ఇండస్ట్రియల్ భూముల కన్వర్షన్ కోసం ఇంపాక్ట్ ఫీజులను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే.. దాన్ని రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.6 లక్షల కోట్ల స్కామ్‌గా కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
‘‘పరిశ్రమలకు ప్రభుత్వం లీజుకిచ్చిన భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ.. ఫ్రీ హోల్డ్ రైట్స్ పేరిట 2023 ఆగస్టులోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వమే 3 జీవోలు ఇచ్చింది. అప్పుడు బీఆర్ఎస్ పాలకులు ఎన్ని లక్షల కోట్లు వసూలు చేశారు? కేటీఆర్ చెప్తున్న 9,292 ఎకరాల భూమిలో పరిశ్రమలకు ప్లాటింగ్ చేసి కేటాయించింది కేవలం 4,740 ఎకరాలే. మిగిలిన భూమి రోడ్లు, డ్రైనేజీ లాంటి మౌలిక వసతుల కల్పనకు వినియోగించారు’’అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. హెచ్ఐఎల్ టీపీ పాలసీ.. ల్యాండ్ స్కామ్ అని ఆరోపించిన కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. సెక్రటేరియెట్‌లోని తన చాంబర్లో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు.
‘‘భూముల కేటాయింపులు ఒక్క రోజులో చేసినవి కావు. పరిశ్రమల అభివృద్ధి కోసం దశాబ్దాల కాలంగా ఇస్తూ వచ్చినవి. ఆజామాబాద్, కూకట్ పల్లి, హఫీజ్ పేటలోని పరిశ్రమల భూములను ఫ్రీ హోల్డ్ పేరిట యాజమాన్య హక్కులు కల్పించింది బీఆర్ఎస్సే. 2023, ఆగస్టు 29న జీవో నంబర్ 19, 20, 21ను జారీ చేసింది. ఆ జీవోలను దాచి ఇప్పుడు మా ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు’’అని శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఇప్పుడు ఆ భూములకే కన్వర్షన్ చాన్స్ ఇచ్చామన్నారు. 30, 50 శాతం శ్లాబుల కింద ఇంపాక్ట్ ఫీజును ఈ నెల 17న కేబినెట్లో నిర్ణయించామని తెలిపారు.
పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నయ్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమితో కేటీఆర్‌కు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయని మంత్రి శ్రీధర్ ఎద్దేవా చేశారు. ‘‘బీఆర్ఎస్కు సంబంధించిన పత్రికలే పరిశ్రమల భూములపై స్కామ్ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నయ్. అసలు స్కామ్ జరిగి ఉంటే వారి హయాంలోనే జరిగి ఉండాలి. పరిశ్రమల యజమానులు హక్కులు పొందాలంటే రిజిస్ట్రేషన్ విలువపై 100% చెల్లించాలని.. ఒకవేళ చేతులు మారితే 200% కట్టాలని జీవోలు ఇచ్చారు. ఆ భూములు మరొకరిపరమైతే హక్కులు ఎలా కల్పిస్తారు? బీఆర్ఎస్ హయాంలో యాజమాన్య హక్కులు కల్పించిన వారికే భూ వినియోగమార్పిడి చేసుకునే అవకాశాన్ని ఇప్పుడు మా ప్రభుత్వం కల్పించింది.
స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పరిశ్ర మల కమిష నర్లు, ఇండస్ట్రీ సంఘాలతో చర్చించిన తర్వాత.. 30%, 50% శ్లాబులను ప్రతిపాదించాం. రేవంత్ సోదరులు ముందస్తు ఒప్పందాలు చేసు కున్నారంటూ నోటికొచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. అసలు వారెవరూ ప్రభుత్వంలోనే లేరు’’అని శ్రీధర్ బాబు అన్నారు. ఒప్పందాలు చేసుకున్నారన్న ఆధారాలు కేటీఆర్ దగ్గరుంటే బయటపెట్టాలని, ప్రభుత్వం దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
రూ.5 వేల కోట్లఆదాయం రావొచ్చు
కన్వర్షన్ ఇంపాక్ట్ చార్జీలతో ప్రభుత్వానికి రూ.5 వేల కోట్ల వరకు ఆదాయం రావొచ్చని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అది కూడా అంద రూ దరఖాస్తు చేసుకుంటేనే వస్తుందని చెప్పా రు. ‘‘యాజమాన్య హక్కులు లేనివాళ్లు కన్వర్ష న్కు దరఖాస్తు చేసుకోలేరు. బీఆర్ఎస్ ఆర్థిక అరాచకత్వానికి పాల్పడివెళ్లిపోతే.. రెండేండ్లు గా దాన్ని సరిదిద్దుతున్నం. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు పాటుపడు తున్నం. ప్రతిపక్షంగా సహకరించకపోయినా ఫర్వాలేదుగానీ.. అబద్ధాలతో ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే ఊరుకోం. బెదిరిం పు ధోరణులు మానుకోవాలి. ఓఆర్ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను బయటికి తరలిస్తామని మొదటి నుంచి చెప్తూనే ఉన్నం. గాలి, నీరు కలుషితం కాకుండా ఉండేందుకే పరిశ్రమలను బయటకు తరలిస్తున్నం’’అని మంత్రి తెలిపారు.
