జల్పల్లిలో ఆక్సిజన్ గ్యాస్ ప్లాంట్లో పేలుడు

జల్పల్లిలో ఆక్సిజన్ గ్యాస్ ప్లాంట్లో పేలుడు
  • నలుగురికి తీవ్ర గాయాలు..
  • జల్​పల్లిలోని లైఫ్ కేర్ మెడికల్​లో ఘటన

ఓల్డ్​సిటీ, వెలుగు: జల్​పల్లిలోని లైఫ్ కేర్ మెడికల్ అండ్ ఇండస్ట్రియల్ ఎయిర్ ప్రొడక్ట్స్ ఆక్సిజన్ ప్లాంట్​లో భారీ పేలుడు సంభవించింది. పటాన్​చెరు, కర్నూలు వంటి ప్రాంతాల నుంచి పెద్ద ట్యాంకర్లలో గ్యాస్ తెప్పించి, చిన్న సిలిండర్లలోకి ఇక్కడ నింపుతుంటారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో  ఒక ట్యాంకర్ వాల్స్​లో లీకేజీ ఏర్పడి ఈ ప్రమాదం జరిగింది. ఈ లీకేజీ వల్ల మొదట ఒక సిలిండర్ పేలి, అది గొలుసుకట్టు పేలుళ్లకు దారితీయడంతో ప్లాంట్ గోడలు పూర్తిగా కూలిపోయాయి.

ఈ ఘటనలో ప్లాంట్ ఆపరేటర్లు బృందావన్ దాస్, సయ్యద్ సలీంతో పాటు పక్కనే ఉన్న కార్ షెడ్డులో పనిచేస్తున్న కౌశిక్, తోఫిక్ అనే మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. గాయపడిన వారిని మైలార్​దేవ్​పల్లిలోని పీజీఆర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్లాంట్ నిర్వహణ అనుమతులపై దర్యాప్తు చేస్తున్నట్లు పహాడీషరీఫ్ ఇన్​స్పెక్టర్ ఎల్.ఎన్. రెడ్డి 
తెలిపారు.