కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్‌లోని జ్యువెల్లరీ షాపులో చోరీ ఘటనపై కేటీఆర్ విలువైన సూచనలు ఇవ్వాలే గానీ, సీఎం రేవంత్‌రెడ్డిపై ఇష్టారాజ్యంగా మాట్లాడడమేంటని సమానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి త్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆర్అండ్‌బీ గెస్ట్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ జ్యువెల్లరీ షాపులో చోరీ ఘటనను రాజకీయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.
సమావేశంలో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, లీడర్లు వూట్కూరి వెంకటరమణ రెడ్డి, రమణరెడ్డి, పులి కృష్ణా, తిరుపతిరెడ్డి, కొరివి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్ దోపిడీ కాల్పుల ఘటనపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాజకీయం చేయడం తగదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.
జ్యువెల్లరీ షాపులో కాల్పుల ఘటనలో గాయపడి హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి బాధితులకు అండగా నిల్వాల్సింది పోయి ప్రజల్లో అభద్రత భావం నెలకొనేలా రాజకీయం చేయడం తగదని మండిపడ్డారు
