- ఎంపీ రఘునందనరావు
కొణిజర్ల/ఖమ్మం టౌన్, వెలుగు : ముగ్గురు మంత్రులన్న ఖమ్మం జిల్లాలో కనీసం పంటను కొనుగోలు చేయలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మెదక్ ఎంపీ రఘునందరావు విమర్శించారు. ఖమ్మం జిల్లా కొణిజర్లలోని మొక్కజొన్న, వడ్ల కొనుగోలు కేంద్రాలను సోమవారం పరిశీలించి, రైతులతో మాట్లాడారు. వడ్ల కొనుగోళ్లు చేపట్టకపోవడం, ఎకరాకు 26.50 క్వింటాళ్ల మక్కలు మాత్రమే కొనుగోలు చేస్తామనడం ఏంటని ప్రశ్నించారు.
మంత్రి తుమ్మల స్పందించి 48 గంటల్లో వడ్లు, మక్కలు కొనాలని, లేకపోతే పంటను మంత్రి కాంపౌండ్‌లో గానీ, కలెక్టరేట్‌లో గానీ పోస్తామని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో ఆఫీసర్లు లేకపోవడానికి తోడు గన్నీ బ్యాగులు, లారీలు, టార్పాలిన్ల కొరత, ట్రక్‌షీట్ల విషయంలో ఆఫీసర్ల చేతివాటం కారణంగా రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, నాయకులు దేవకి వాసుదేవరావు, సన్నీ ఉదయ్ ప్రతాప్, రుద్ర ప్రదీప్, పుల్లారావు, రమేశ్, సుబ్బారావు, వెంకటేశ్వరరావు, నరేశ్, పుల్లయ్య పాల్గొన్నారు. అనంతరం ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. కాకతీయ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఎంపీ రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో టీవీకే (విజయ్) పార్టీతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, కేరళంలోనూ పాగా వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
