గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో మరో కార్మిక సంఘం ఆవిర్భవించింది. సోమవారం మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య(టీజీబీకేఎస్) పేరిట కొత్త సంఘాన్ని ప్రకటించారు. వివిధ రాజకీయ పార్టీలకు అనుబంధంగా కార్మిక సంఘాలు ఉన్న నేపథ్యంలో ఎవరికీ అనుబంధంగా లేకుండా స్వచ్ఛందంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు సంఘం బాధ్యుడు కెంగెర్ల మల్లయ్య తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాల వల్ల ప్రభుత్వ రంగంలో బొగ్గు గనుల తవ్వకాలు తగ్గిపోతూ ప్రైవేటు రంగంలో పెరుగుతున్నాయని విమర్శించారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం కొత్త సంఘం పనిచేస్తుందని పేర్కొన్నారు. కెంగెర్ల మల్లయ్య గతంలో ఐఎఫ్‌టీయూ, ఏఐఎఫ్‌టీయూ విప్లవ కార్మిక సంఘాల్లో పనిచేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌కు అనుబంధంగా ఏర్పడిన టీబీజీకేఎస్ సంఘానికి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిగా పదేళ్లపాటు పనిచేశారు.
