
లండన్: రాచరిక వైభవం, మిరిమిట్లు గొలిపే లైట్లతో మెరిసే లండన్ సిటీలో ఇప్పుడు ఎక్కడ చూసినా పాన్ నమిలి ఉమ్మిన మరకలే కనిపిస్తున్నాయి. రేనర్స్ లేన్ నుంచి నార్త్ హారో దాకా రోడ్ల పక్కన ఉమ్మివేతలతో పడిన ఎరుపు మరకలకు సంబంధించిన వీడియో ఒకటి సోమవారం వైరల్ అయింది. పాన్ డబ్బాలు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు అమ్మే దుకాణాలు, రెస్టారెంట్ల చుట్టుపక్కల ఈ మరకలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయని లండన్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ రెండు ప్రాంతాల్లోని డస్ట్‌బిన్‌లపై ఎక్కడచూసినా అవే మరకలున్నాయని రేనర్స్ లేన్ ప్రాంత నివాసులు మండిపడుతున్నారు. ఈ మధ్యే కొత్తగా పెట్టిన నార్త్ హారోలోని ఓ పాన్‌షాప్‌పై అక్కడి లోకల్స్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ షాప్ కారణంగా ఉమ్మివేతలు, మరకలు మరింత పెరగొచ్చని వారు భావిస్తున్నారు.
అయితే, రోడ్లవెంట పాన్ మరకలకు గుజరాతీలు, పంజాబీలే కారణమంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఉమ్మివేతలు నిషేధమని పేర్కొంటూ ఇంగ్లిష్, గుజరాతీ భాషల్లో సైన్‌బోర్డులు ఏర్పాటు చేశారు. 150 డాలర్ల జరిమానా విధిస్తామని హెచ్చరించినా సమస్య తీరట్లేదని నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.