గత నాలుగు సంవత్సరాలుగా హైదరాబాద్‌లోని తెల్లాపూర్‌లో ‘ఫూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫీ అండ్ ఇంగ్లిష్ ట్రైనింగ్’ (పీఏసీపీఈటీ) అనే ఒక విద్యాసంస్థ నడుస్తున్నది. దీన్ని కొల్లూరి సత్తయ్య కుటుంబం సొంత డబ్బుతో నడుపుతోంది. గత 48 నెలల్లో ఈ సంస్థ 28 బ్యాచ్‌లుగా దాదాపు 1,150 మంది యువతీ యువకులకు ఉచిత తిండి, ఉచిత వసతి, ఉచిత కోచింగ్ ఇచ్చింది.
ఈ సంస్థ పేరు సూచించినట్టు ఇది యువతీ యువకులకు ఫూలే, అంబేద్కర్ ఫిలాసఫీని, శ్రమ గౌరవాన్ని ఇంగ్లిషులో నేర్పుతూ పూర్తిగా ప్రాంతీయ భాషల్లో డిగ్రీ వరకు చదువుకుని ఇంగ్లిషు మాట్లాడటం, రాయడం రాక, ఈ దేశ ఉత్పత్తి పునాదులు తెలియక సతమతమవుతున్నవారికి ఒక కొత్త జీవితాన్ని అందించే కృషి చేస్తోంది. ఈ సంస్థను నడుపుతున్న కొల్లూరి సత్తయ్యది మాదిగ కులం. సంస్థ డైరెక్టర్ బాలబోయిన సుదర్శన్‌ది మాల కులం. కో ఆర్డినేటర్ పల్లికొండ మల్లికంటది శూద్ర కాపు కులం. ప్రస్తుతం ఇంగ్లిష్ నేర్పించే ప్రశాంత్ తివారీది బ్రాహ్మణ కులం. దీనికి ఒక సలహాదారుగా పనిచేసే నా కులమేంటో అందరికీ తెలుసు.
‘పీఏసీపీఈటీ’లో ట్రైనింగ్ పొందిన విద్యార్థులు కులం కూడా ముందే ప్రకటించుకుంటారు. ఇప్పటివరకు ఇక్కడ ఫిలాసఫీ నేర్చుకున్నవారిలో ఎక్కువగా శూద్ర బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మాత్రమేకాక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల అబ్బాయిలు, అమ్మాయిలు ఉన్నారు. కొద్దిమంది ముస్లింలు, క్రిస్టియన్లు ఉన్నారు. ఈ సంస్థ ప్రతి బ్యాచ్‌కు 20 మంది అమ్మాయిలకు, అబ్బాయిలకు అడ్మిషన్ ఇస్తుంది. ఇక్కడ కోచింగ్ పొందినవాళ్లు దేశంలోని 23 రాష్ట్రాల నుంచి ఉన్నారు. నార్త్ ఈస్ట్ వారు కూడా ఉన్నారు. ఇప్పటివరకు కాశ్మీర్ నుంచి మాత్రం ఎవరూ చేరలేదు.
ఫూలే, అంబేద్కర్ గురించి...
ఈ విద్యార్థులంతా నెలరోజుల్లో ఇంగ్లిషులో ఫూలే గులాంగిరి, అంబేద్కర్‌ది అన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, సావిత్రిబాయి రచనలు కొన్ని, డిగ్నిటీ ఆఫ్ లేబర్ లెసన్స్ కొన్ని చదివి బయటకుపోతారు. ప్రపంచ సిద్ధాంత కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటారు. వీరు ఒక నెలలో ఎంత నేర్చుకున్నారు అని మచ్చుగా అర్థం చేసుకోవడానికి ఇందులో దాదాపు 90 మంది ఇంగ్లిషులో రాసిన వ్యాసాల సంకలనం 2026 జనవరి 26న ‘లెర్నింగ్ ఇంగ్లిష్ నేషనలిజం’ అనే పుస్తకాన్ని అచ్చువేసిందీ సెంటర్. అది చదివితే ఈ పిల్లలు ఎటువంటి ఉత్పత్తివాద అనుకూల జాతీయవాదాన్ని నేర్చుకున్నారో అర్థమౌతుంది.
దేశంలోని మనుషులు కులరహితులు కాకుండా ఉత్పత్తివాద జాతీయవాదులు కాలేరు. కులతత్వంతో జీవించేవారు దోపిడీవాద జాతీయవాదులు అవుతారు. ఇక్కడ ట్రైన్ అయిన ఆడ, మగ యువకులకు ఎవరి కులం ఏంటో తెలుసు. సంస్థ నడిపేవారి కులం తెలుసు. ట్రైన్ చేసేవారి కులం తెలుసు. అది కేవలం మానవుని పేరులాగ ఐడెంటిటీ మాత్రమే. దేశానికి వర్ణ–కుల వ్యవస్థ వల్ల జ్ఞాన నష్టం గురించి వీళ్లు నేర్చుకుంటారు. తమలో తాము చర్చించుకుంటారు.
ఫూలే–అంబేద్కర్ రచనతోపాటు శ్రమ గౌరవం గురించి నేర్చుకునేటప్పడు ఏ కులం ఉత్పత్తి రంగంలో ఉంది. ఏది బయట ఉంది. ఏ కులాన్నీ ఎవరూ ఎన్నుకుని పుట్టలేదు కాబట్టి, ఆ కులంపేరు కంటే కుల వ్యవస్థ మానవ అభివృద్ధి వ్యతిరేక లక్షణాలను అధ్యయనం చేస్తారు. ఇదంతా ఇంగ్లిషులో
మాట్లాడుతూ, రాస్తూ చేస్తారు. విని నేర్చుకోవడం ఇక్కడ ఉండదు. చదివి, చర్చించి నేర్చుకోవడం
ప్రధానంగా ఉంటుంది.
మచ్చుకు చూద్దాం
ప్రతి బ్యాచ్ ఆఖరి రోజుల్లో నేను వారితో కూర్చుని.. ఒక్కొక్కరిని తన బ్యాక్‌గ్రౌండ్, తల్లిదండ్రుల వృత్తి, జీవన విధానం, వీరి భవిష్యత్ గురించి మాట్లాడించి వింటాను. సాధారణంగా ఆడవారుగాని, మగవారుగాని ఒకే రాష్ట్ర భాష మాట్లాడేవారిని ఒకే రూంలో పెట్టరు. గనుక, వాళ్లు రూముల్లో తమకొచ్చిన ఇంగ్లిషులోనే కమ్యూనికేట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచే వారి మార్పు మొదలవుతుంది. 28వ బ్యాచ్ పిల్లలు 25 రోజుల ట్రైనింగ్ పూర్తిచేసుకున్న తరువాత నేను వారితో మాట్లాడాను. ఈ బ్యాచ్ కంపోజిషన్ చూడండి.
రాజస్తాన్ నుంచి ఒక భంగి యువకుడు, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక క్షత్రియ యువకుడు, తమిళనాడు నుంచి ఒక ముస్లిం యువకుడు, తెలంగాణ నుంచి ఒక కోయ అమ్మాయి. ఒక 19 ఏండ్ల దళిత అమ్యాయి నార్త్ ఇండియా నుంచి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్ నుంచి విభిన్న కులాల నుంచి ఉన్నారు.
25 రోజుల్లో ఇంగ్లిష్‌పై పట్టుఒక ఆదివాసీ అమ్మాయి ఇంటర్లో ఉండగానే ఒక అబ్బాయి ప్రేమలోపడి అతని మోసానికిగురై ఆత్మహత్యాయత్నం చేసింది. హైదరాబాద్ నుంచి ఒక ముస్లిం అబ్బాయి ఒకరి తరువాత ఒకరు ముగ్గురి అమ్మాయిలను ప్రేమించి మోసపోయి చదువు నాశనం చేసుకున్నాడు. వీళ్లందరూ 25 రోజుల్లో ఇంగ్లిష్ మాట్లాడే పట్టు సాధించారు. ఆత్మహత్యాయత్నం చేసిన కోయ అమ్మాయి ‘పీఏసీపీఈటీ’ అనుభవం తరువాత ఐపీఎస్ కోసం కుస్తీ పడతానని అందరి ముందూ చెప్పింది.
రాజస్తాన్ భంగీ అబ్బాయి తనొక మేధావినయ్యేంతవరకు పట్టు విడువక చదువుతాను అని ధైర్యంగా ఇంగ్లిషులో చెప్పడం మాములు మాట కాదు. అతను రాజస్తాన్ భాషలో చదువుకున్నాడు. కానీ, ఇంగ్లిషులో మొదటిసారి మాట్లాడటం ప్రారంభించాడు. క్షత్రియ అబ్బాయి నా బ్రాహ్మణ గర్ల్ ఫ్రెండ్ నాకు అంబేద్కర్ రాసిన అన్నిహిలేషన్ కాస్ట్ పుస్తకం ఇస్తే నేను చదివాను కానీ నా అప్పర్ క్యాస్ట్ మిత్రులు అలాంటి పుస్తకాలు చదవవద్దని గొడవ చేశారు కూడా అని చెప్పి ‘పీఏసీపీఈటీ’ నాకు కులంతో దేశానికి వస్తున్న నష్టాన్ని తెలియజెప్పింది.
నేను అంబేద్కరిస్టుగా పనిచేయాలనుకుంటున్నా అని ప్రకటించాడు. టాయిలెట్ కడుగుడు, ఇంగ్లిష్ నేర్చుడుఇక్కడికొచ్చే చాలామంది యువతీ, యువకులు సెల్‌ఫోన్ స్క్రీన్‌మీద ఐదారు గంటలు గడిపే అలవాటు ఉన్నవారు. కాలేజీ లేనప్పుడు, సెలవులలో ఉదయం 11– 12గంటల వరకు పండే అలవాటు కలవారు. ఇంట్లో ఏ పనీ చేయరు.
కానీ ‘పీఏసీపీఈటీ’లో ఉదయం 5.30కు లేవాలి. ఒక గంట వరకు ఎక్సర్సైజు చేయాలి. మిల్లెట్ బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. మళ్లీ రాత్రి 10గంటల వరకు పనిచేస్తూ ఉండాల్సిందే. లంచ్‌లో, డిన్నర్లో మంచి ఫుడ్ ఇస్తారు. కానీ పనిచేయాలి. భారతదేశంలో మనం వాడుకునే టాయిలెట్ మనం శుభ్రంగా కడుక్కునే అలవాటు లేదు. కానీ, పీఏసీపీఈటీలో జాయిన్ అయిన మరుసటి రోజునే వంతులవారీగా ఊడ్చుడు, టాయిలెట్లు కడుగుడు విధిలా చేయాలి.
ఈ పనిలో కులం, ఇంట్లో ఉన్న ఆస్తులు, సొంత స్వభావాలతో పనిలేదు. ఇప్పటివరకు 28 బ్యాచ్‌లలో మేం ఈ పని చేయం అని కోర్సు వదిలిపెట్టినవారు లేదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్‌ను బ్రాహ్మణిజం వేల ఏండ్లు చంపింది. తిని కూర్చుని, ధ్యానం, తపస్సు చేసే సన్యాసులను గొప్పవారని, గురువులని కథలు చెప్పింది. ఎక్కువ కులంవాళ్లు అనుకుంటే ఎక్కువ పని దొంగలు కావడం గొప్ప కల్చర్‌గా చూపించారు.
డిగ్నిటీ ఆఫ్ లేబర్
ఏ యూనివర్సిటీగానీ, కాలేజీగానీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి పాఠాలు చెప్పడంగానీ, పనిచేయడంగానీ చేయదు. చదువుకున్నవాళ్లు పనిచేయొద్దు అనే కల్చర్‌ను బ్రాహ్మణిజంలో భాగంగా యువకుల మెదళ్లుకు పని వ్యతిరేకతను ఎక్కించడమే భారతీయ సంస్కృతి అని నూరిపోశారు. భరతమాత కొడుకులు ఇల్లు ఊడ్వరు. గిన్నెలు తోమరు, పూజలు ఎక్కువ చేసేవారు, స్వర్గానికి చక్కగా పోదలుచుకున్నవారు ఇతరులు చూస్తుండగా తినరు.
ఇవన్నీ భారతీయ సంస్కృతిలో భాగమంటారు. కానీ, పీఏసీపీఈటీ అన్ని పనులు సమాన ఆత్మగౌరవంతో చేయిస్తుంది. ఇంగ్లిష్ భాషలో మాట్లాడుతూ హుందాగా టాయిలెట్ కడిగే పనికూడా పుస్తకం రాసేపనిలాంటిదే అని చెబుతుంది. చేయిస్తుంది. సంస్కృత పండితులు దొడ్డికి పోవాలి కానీ, టాయిలెట్ కడుక్కోవద్దు అన్నట్టుగా చదువును, శ్రమ వ్యతిరేక చదువుగా మారిస్తే పీఏసీపీఈటీలో ఇంగ్లిష్ చదువుతూ అన్ని పనులు ఆనందంగా చేయాలనే విలువను నూరిపోస్తుంది.
ఆత్మగౌరవం
అన్ని కులాల అమ్మాయిలు, అబ్బాయిలు పీఏసీపీఈటీలో నెల రోజులు జీవించాక ఆత్మగౌరవం, అన్ని మానవ అవసరాల పనులపై గౌరవంతో కుల తత్వాన్ని, విష సంస్కృతిని వదిలేసి కొత్త జీవులుగా తిరిగి ఇంటికిపోతారు. ఇక్కడి నుంచి ఇండ్లకు చేరిన తరువాత వాళ్ల తల్లిదండ్రులు వీళ్ల పనితనం, ప్రవర్తన చూసి ఆశ్చర్యపడుతున్నారని చెప్పిన అమ్మాయిలు, అబ్బాయిలు చాలామంది ఉన్నారు. చాలా మూఢ నమ్మకాలతో పీఏసీపీఈటీకి వచ్చి సైంటిఫిక్ సంస్కృతిని బీజరూపంలోనైనా ఎక్కించుకుని తిరిగిపోతారు.
ఎంత సైన్సు అభివృద్ధి అయినా, ఏఐ ఎంత ఉనికిలోకి వచ్చినా మానవ శ్రమ మాత్రమే జీవనానికి మూలం. అందుకే ఎక్కువ చదువుకుంటే శ్రమపట్ల ఎక్కువ గౌరవాన్ని చూపించాలి. కానీ, ఈ దేశం 3వేల ఏండ్లు చదువుకున్నవారి శ్రమ వ్యతిరేక జీవితంతో అభివృద్ధిని అడ్డుకున్నారు. పీఏసీపీఈటీ ఆ సంస్కృతికి అడ్డుకట్ట వేస్తుంది. కులగోడలు కూలగొట్టి శ్రమ గౌరవ మానవ గోడలు కడుతోంది.
- ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్–
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
