మక్కలు కొనాలని ఉద్యమించినందుకు ప్యాడీ సెంటర్​ తీసేశారు

మక్కలు కొనాలని ఉద్యమించినందుకు ప్యాడీ సెంటర్​ తీసేశారు
  • నాలుగేళ్లుగా నడుస్తున్న సెంటర్ ను క్యాన్సిల్ చేసిన ఆఫీసర్లు
  • జగిత్యాల కలెక్టరేట్ కు తరలివచ్చిఆందోళన చేపట్టిన రైతులు
  • నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిక

జగిత్యాల, వెలుగుఅదో ఆదర్శ రైతు సొసైటీ. నాలుగు వందల మంది రైతులు నాలుగేళ్ల క్రితం  ‘లక్ష్మీ పూర్ పరస్పర సహకార సంఘం’ పేరిట ఏర్పాటు చేసుకున్నారు. పంటలు పండించడంలో, వాటిని మార్కెటింగ్​ చేసుకోవడంలో, మద్దతు కోసం ఉద్యమిండంలో ఈ సొసైటీకి ఎంతో గుర్తింపు ఉంది. ఈ క్రమంలో ఇటీవల సొసైటీలోని రైతులంతా మక్కలకు మద్దతు ధర కోసం జగిత్యాల కేంద్రంగా ఉద్యమించారు. సర్కారే మక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం దిగివచ్చి ఒకే అన్నది. కానీ అదే సమయంలో లక్ష్మీపూర్​ సొసైటీ ఆధ్వర్యంలో నాలుగేళ్లుగా నడుస్తున్న సెంటర్​ను  ఆఫీసర్లు చెప్పాపెట్టకుండా క్యాన్సిల్​ చేశారు. కాగా, ఇది తమపై కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని ఆరోపిస్తూ రైతులు సోమవారం రోడ్డెక్కారు. న్యాయం కోసం జగిత్యాల కలెక్టరేట్​ ఎదుట ఆందోళనకు దిగారు.

ఆదర్శం.. లక్ష్మీపూర్​సొసైటీ ..

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీ పూర్ గ్రామం లో రైతులంతా కలిసి నాలుగేళ్ల క్రితం ‘లక్ష్మీ పూర్ పరస్పర సహకార సంఘం’ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో 400 మంది రైతులు మెంబర్​షిప్​ తీసుకున్నారు. వీళ్లు పండించిన కూరగాయలు, పండ్లు, ఇతరత్రా నిత్యావసరాలను ఈ సొసైటీ ద్వారానే మార్కెటింగ్​ చేసుకుంటున్నారు. ఇది ఆదర్శ రైతు సంఘంగా గుర్తింపు పొందడంతో ఆఫీసర్లు ఇక్కడ ఐకేపీ సెంటర్ ఏర్పాటుచేయకుండా ఆ బాధ్యతలను కూడా సొసైటీకే అప్పగించారు. నాలుగేళ్లుగా ప్రతి సీజన్​లోనూ సొసైటీ ఆధ్వర్యంలోనే వడ్ల కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్నారు. కొనుగోలుచేసిన ధాన్యాన్ని డీసీఎంఎస్​కు  తరలించేవారు. కానీ ఈసారి ఉన్నట్టుండి సొసైటీని వడ్ల కొనుగోలు నుంచి ఆఫీసర్లు తప్పించారు. లక్ష్మీపూర్​ సొసైటీ కొనుగోలుకేంద్రాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పడంతో పాటు డీసీఎంఎస్ ద్వారా కొంటామని ప్రకటించారు. మక్కలను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలుచేయాలనే డిమాండ్​తో లక్ష్మీపూర్​ సొసైటీ తరుపున ఇటీవల ఆందోళన చేయడం వల్లే సర్కారు తమపై కక్షగట్టిందని ఇక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే తమ సొసైటీకి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  రైతులంతా సంఘటితం అయ్యేందుకు రైతువేదికలు నిర్మిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, ఒక ఆదర్శ రైతు సంఘంపై ఇలా కక్ష తీర్చుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

కలెక్టరేట్​ ఎదుట ఆందోళన..

లక్ష్మీపూర్​ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆఫీసర్లు ఎత్తేయడంతో ఆగ్రహించిన రైతులంతా సోమవారం ఉదయమే జగిత్యాల చేరుకున్నారు. నేరుగా కలెక్టరేట్ వెళ్లి గేటు ముందు బైఠాయించారు. మక్కలకు మద్దతు ధర కోసం ఉద్యమించామనే ఒకే ఒక్క కారణంతో తమపై ప్రభుత్వం కక్ష తీర్చుకుంటోందని ఆరోపించారు. రైతు సంఘాలకు ఆదర్శంగా నిలుస్తున్న తమ సొసైటీ నుంచి వడ్ల కొనుగోలుకేంద్రాన్ని తప్పించడం ఎంతవరకు కరెక్ట్​ అని నిలదీశారు. వెంటనే తమ సొసైటీ ద్వారా  కొనుగోళ్లు జరపాలని డిమాండ్​ చేస్తూ సోమవారం సాయంత్రం వరకు ఆందోళన కొనసాగించారు. చివరికి రైతుల డిమాండ్​ను పరిశీలిస్తామని కలెక్టర్  హామీ ఇవ్వడంతో రైతులంతా
వెనుదిరిగారు.

ఇది కక్ష సాధింపు చర్య..

మక్కలకు మద్దతు ధర కోసం ఇటీవల తాము ఆందోళన చేసినందుకే సర్కార్ దిగొచ్చింది. కానీ, ఉద్యమానికి మా లక్ష్మీపూర్​ సొసైటే కారణమని భావించిన సర్కారు ఇప్పుడిలా కక్ష తీర్చుకుంటోంది. ఇందులో భాగంగానే మా సొసైటీ ఆధ్వర్యంలో నాలుగేళ్లుగా నడుస్తున్న కొనుగోలు కేంద్రాన్ని ఆఫీసర్లు రద్దు చేశారు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే.
-పన్నల తిరుపతి రెడ్డి, రైతు ఐక్యవేదిక అధ్యక్షుడు

ఎందుకు ఎత్తేశారో చెప్పాలి..

సొసైటీ ఆధ్వర్యంలో నాలుగేళ్లుగా నడుస్తున్న ధాన్యం కొనుగోలు సెంటర్​ను ఆఫీసర్లు ఈసారి ఎందుకు ఎత్తేశారో చెప్పాలి. కొద్దిరోజుల ముందే మా సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్​ ఏర్పాటు చేస్తామని ఆఫీసర్లు చెప్పారు. దీంతో 10 లక్షలు ఖర్చు పెట్టి సెంటర్​కు భూమి చదును చేయిస్తే.. ఇప్పుడు క్యాన్సిల్​ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నష్టం ఎవరు భరించాలి.
-చంద్ర శేఖర్ ,రైతు ,లక్ష్మీ పూర్